నిషేధిత భూములన్నీ బీఆర్ఎస్ లీడర్ల పరం అవుతున్నయ్ : కోదండరెడ్డి

నిషేధిత భూములన్నీ బీఆర్ఎస్ లీడర్ల పరం అవుతున్నయ్ : కోదండరెడ్డి
  • భూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు అయినా కేసీఆర్ నెరవేర్చాలె: కోదండరెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలోని నిషేధిత భూములన్నీ బీఆర్ఎస్ లీడర్ల పరం అవుతున్నాయని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను బీఆర్ఎస్ లీడర్లు తక్కువ రేటుకే కొనుక్కుని.. తమ పరం అయ్యాక వాటిని నిషేధిత జాబితాలో లేకుండా చేసుకుంటున్నారని చెప్పారు. అధికారంలోకి వస్తే భూ సమస్యలు లేకుండా చేస్తానని 2017లో చెప్పిన కేసీఆర్ ఐదేండ్లు అయినా ఇప్పటి వరకు పరిష్కరించలేదని, రాష్ట్రవ్యాప్తంగా25 లక్షల కుటుంబాలు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని  విమర్శించారు.

గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కోదండరెడ్డి భూ సమస్యలపై త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో భూ సంస్కరణలు తీసుకొచ్చి భూమి పంపకాలు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ అనుకోకుండా అధికారంలోకి వచ్చిందన్నారు. భూ సమస్యలపై గత నెలలో చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ను కలసి వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. 

నెల రోజులైనా దానిపై చీఫ్ సెక్రెటరీ నుంచి ఎలాంటి జవాబు రాలేదన్నారు. సీసీఎల్ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడామని, టీఎం 33 మాడ్యూల్ ప్రకారం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. పేర్లు తప్పు బడితే మార్చుతున్నామని చెప్పారని కోదండరెడ్డి వివరించారు. ఎంతో కీలకమైన రెవెన్యూ డిపార్ట్ మెంట్ ను కేసీఆర్ చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. భూ సమస్యలపై ఇప్పటికే మండల, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల స్థాయిలో పోరాటం చేశామని.. త్వరలోనే మరోసారి కాంగ్రెస్ పార్టీ చర్చించి భవిష్యత్ కార్యాచరణ  ప్రకటిస్తామని కోదండరెడ్డి స్పష్టం చేశారు.