కామారెడ్డి కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు

కామారెడ్డి కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్  పార్టీ లీడర్ల మధ్య లొల్లి ముదురుతుంది. ఆధిపత్యం కోసం అంతర్గతంగా గొడవలకు దిగడం పార్టీ శ్రేణుల్లో అయోమయానికి కారణమవుతోంది. గత పార్లమెంట్​ ఎన్నికల్లో జహీరాబాద్​ నుంచి పోటీ చేసిన పీసీసీ ఐటీ సెల్​ చైర్మన్​కె మదన్​మోహన్​రావును పార్టీ నుంచి ఏడాది పాటు సస్పెండ్​ చేస్తున్నట్లు డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు ప్రకటించడం వివాదాస్పదమైంది. మదన్​మోహన్​ను సస్పెండ్​ చేసే అధికారం డీసీసీ ప్రెసిడెంట్​కు లేదని ఆయన వర్గీయులు అంటున్నారు. ఈ అంశంపై పీసీసీకి ఫిర్యాదు చేశారు. పార్టీ సీనియర్​ నేత, మాజీ మంత్రి షబ్బీర్​అలీ, మదన్​మోహన్​రావు మధ్య ఉన్న విభేదాలు ఈ ఘటనతో మరోసారి బయటపడ్డాయి. 2019 పార్లమెంట్​ ఎన్నికలకు ముందు మదన్​మోహన్​రావు కాంగ్రెస్​లో చేరి ఎంపీగా బరిలో నిలిచారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అల్లుడైన ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఎంపీ ఎలక్షన్స్​ వరకు షబ్బీర్​, మదన్​మోహన్​ మధ్య సఖ్యత ఉంది. ఇద్దరు కలిసి ప్రోగ్రామ్స్​లో పాల్గొనేవారు. ఈ ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది.  

పట్టు సాధించేందుకేనా..? 

కామారెడ్డి మినహా బాన్స్​వాడ, ఎల్లారెడ్డి, జుక్కల్​లో పట్టు సాధించేందుకు మదన్​మోహన్​రావు ఏడాది కాలంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజక వర్గాల్లో పర్యటిస్తూ మండల ప్రెసిడెంట్లు, ఇతర లీడర్లను తన వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. దీంతో ఇద్దరు నేతల అనుచరులు విడిపోయి రెండు గ్రూపులుగా మారారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్​ వడ్డేపల్లి సుభాష్​రెడ్డి కూడా పోగ్రామ్స్ ​చేపడుతున్నారు. సుభాష్​రెడ్డి, మదన్​మోహన్​రావు ఇద్దరూ పార్టీ ఆందోళనలను వేర్వేరుగా చేపట్టారు. ఎల్లారెడ్డి, గాంధారిలో ఇరువర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి.  ఎల్లారెడ్డిలో జరిగిన ‘మన ఊరు-–మన పోరు’ బహిరంగ సభ ఏర్పాట్లను సుభాష్​రెడ్డి చూసుకోగా, ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో గొడవ జరిగింది. మదన్​మోహన్​ నిర్వహించిన కామారెడ్డి జాబ్​మేళాకు హాజరైన అజారుద్దీన్​ అధిష్టానం అనుమతిస్తే తాను కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని చేసిన వ్యాఖ్యలను షబ్బీర్​అలీ అనుచరులు జీర్ణించుకోలేక పోయారని అంటున్నారు. 

పీసీసీ చెంతకు వివాదం

జిల్లా లీడర్ల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలపై మదన్​మోహన్​రావును పార్టీ నుంచి ఏడాది పాటు సస్పెండ్​ చేస్తున్నట్లు డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు ఈ నెల22న ప్రకటించారు. 
ఈ విషయాన్ని పీపీసీ దృష్టికి తీసుకెళ్లగా, వివరణ ఇవ్వాలని డీసీసీ ప్రెసిడెంట్​కు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​గౌడ్​ లేఖ రాశారు. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.