5 న్యాయాలు.. 25 గ్యారంటీలు..లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఫైనల్

5 న్యాయాలు.. 25 గ్యారంటీలు..లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఫైనల్
  • సీడబ్ల్యూసీ భేటీలో విస్తృతంగా చర్చ 
  • యువ, నారీ, కిసాన్, శ్రామిక్, హిస్సేదారీ వర్గాలకు న్యాయం
  • ఒక్కో వర్గానికి 5 చొప్పున గ్యారంటీలు 
  • మేనిఫెస్టోకు తుది ఆమోదం, రిలీజ్ డేట్​పై నిర్ణయం ఖర్గేకు

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ఐదు వర్గాలకు న్యాయం చేసేలా 25 గ్యారంటీలను పొందుపర్చాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ‘పాంచ్ న్యాయ్’ ఎజెండాపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నేతలు అంబికా సోని, ప్రియాంకా గాంధీ, పి. చిదంబరం, దిగ్విజయ్ సింగ్, అజయ్ మాకెన్, కుమారి షెల్జా తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఫైనల్ అయినట్లు తెలిపాయి. 

సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడారు. భారత్ జోడో న్యాయ్ యాత్రతో పార్టీకి వచ్చిన ఊపు లోక్ సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని వారు చెప్పారు. యాత్ర సందర్భంగా ఇదివరకే ఐదు గ్యారంటీలను పార్టీ ఆవిష్కరించిందని, వీటిని ఇకపై క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. మేనిఫెస్టోకు తుది ఆమోదం తెలపడంతోపాటు మేనిఫెస్టో రిలీజ్ తేదీ నిర్ణయాన్ని పార్టీ చీఫ్​ఖర్గేకు అప్పగించినట్లు  వారు తెలిపారు. మేనిఫెస్టోలో 25 గ్యారంటీలతోపాటు జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, లడఖ్ కు స్పెషల్ స్టేటస్, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం నివారణకు చట్టం, ఓల్డ్ పెన్షన్ స్కీం పునరుద్ధరణ, ఎకనమిక్ పాలసీ, ఫారిన్ పాలసీ, రాజ్యాంగ రక్షణ, పర్యావరణం వంటి అంశాలు కూడా ఉన్నాయన్నారు. 

దేశం మార్పును కోరుతోంది.. 

భారత్ జోడో న్యాయ్ యాత్రలోని 5 పిల్లర్స్ అయిన కిసాన్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ (అణగారిన వర్గాలు) న్యాయ్ అంశాల్లో 5 చొప్పున గ్యారంటీలను చేర్చినట్లు సీడబ్ల్యూసీ భేటీ తర్వాత ఖర్గే ట్వీట్ చేశారు. ‘‘1926 నుంచీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నమ్మకం, అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం దేశంలో మార్పు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. 

ప్రధాని మోదీ ప్రభుత్వం ఇప్పుడు గ్యారంటీలు ప్రచారం చేసుకుంటోంది.. కానీ 2004లో భారత్ వెలిగిపోతోంది అంటూ ఎన్నికలకు వెళితే ఆ పార్టీకి ఏ ఫలితం ఎదురైందో, ఇప్పుడూ అదే రిపీట్ అవుతుంది” అని ఖర్గే పేర్కొన్నారు. తాము మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల చెంతకు తీసుకెళ్తామన్నారు. కాగా, కాంగ్రెస్ మేనిఫెస్టో కేవలం మేనిఫెస్టో కాదని.. అది ‘న్యాయ పాత్ర’ అని ఆ పార్టీ ట్వీట్ చేసింది. గత పదేండ్ల బీజేపీ పాలనలో దేశానికి జరిగిన అన్యాయాలను తాము సరిచేస్తామని పేర్కొంది. 

యువ న్యాయ్ 

    భారతి భరోసా: జాబ్ క్యాలెండర్ కు రూపకల్పన. 30 లక్షల కొత్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
 
    పెహ్లీ నౌక్రీ పక్కీ: విద్యావంతులైన యువతీయువకులందరికీ ఏడాది అప్రెంటీస్ షిప్ అవకాశం. 
ఏడాదికి రూ. లక్ష (నెలకు రూ. 8,500) చెల్లింపు
    పేపర్ లీక్ సే ముక్తి: పేపర్ లీకేజీలను పూర్తిగా నివారించేందుకు చట్టం 

    గిగ్ ఎకానమీ మే సామాజిక్ సురక్షా: గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, వర్కింగ్ కండిషన్స్ మెరుగుదల 

    యువ రోశ్నీ: యువత కోసం రూ. 5 వేల కోట్లతో స్టార్టప్ ఫండ్ 

నారీ న్యాయ్

    మహాలక్ష్మి: ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ. లక్ష సాయం
    ఆధి ఆబాదీ, పూరా హక్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు 
    శక్తీ కా సమ్మాన్: ఆశా, అంగన్ వాడీ, మిడ్ డే మీల్ వర్కర్లకు కేంద్రం నుంచి డబుల్ శాలరీ కంట్రిబ్యూషన్ 
    అధికార్ మైత్రీస్: మహిళలు న్యాయపరమైన హక్కులను పొందేలా సాయం చేసేందుకు ప్రతి గ్రామంలో ఒక అధికార్ మైత్రి నియామకం 
    సావిత్రిబాయి పూలే హాస్టల్స్: వర్కింగ్ విమెన్ కు హాస్టళ్ల సంఖ్య రెట్టింపు  

కిసాన్ న్యాయ్

    సహీ దామ్: స్వామినాథన్ ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి లీగల్ గ్యారంటీ 
    కర్జా మాఫీ ఆయోగ్: రైతుల పంట రుణాల మాఫీపై కమిషన్ ఏర్పాటు 
    బీమా భుగ్తన్ కా సీదా ట్రాన్స్ ఫర్: పంట నష్టపోతే 30 రోజుల్లోపు బీమా సొమ్ము చెల్లింపు
    సహీ ఆయత్–నిర్యాత్ నీతి: రైతుల ప్రయోజనం కోసం స్థిరమైన ఇంపోర్ట్–ఎక్స్ పోర్ట్ విధానం
    జీఎస్టీ ముక్త్ ఖేతీ: వ్యవసాయానికి ఇన్ పుట్లపై జీఎస్టీ తొలగింపు 

శ్రామిక్ న్యాయ్

    స్వాస్థ్య అధికార్: ఉచిత వైద్యం కల్పించే యూనివర్సల్ హెల్త్ కేర్ విధానం కోసం ఆరోగ్య హక్కు చట్టం 
    శ్రమ్ కా సమ్మాన్: జాతీయ ఉపాధి హామీ కూలీలు సహా దేశవ్యాప్తంగా ఇతర కార్మికులందరికీ జాతీయ రోజువారీ కనీస వేతనం రూ. 400 
    షేహ్రీ రోజ్ గార్ గ్యారంటీ: పట్టణ ప్రాంతాల కోసం ఉపాధి హామీ చట్టం 
    సామాజిక్ సురక్షా: అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా 
    సురక్షిత్ రోజ్ గార్: కోర్ గవర్నమెంట్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ నిలుపుదల 


హిస్సేదారీ (అణగారిన వర్గాలు) న్యాయ్  


    గింతీ కరో: సామాజిక, ఆర్థిక, కుల గణన
    ఆరక్షణ్ కా హక్: రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్ లపై 50% పరిమితి ఎత్తివేత  
    ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్: ఎస్సీ/ఎస్టీలకు వారి జనాభా ప్రకారం సమాన వాటాతో స్పెషల్ బడ్జెట్ 
    జల్–జంగల్–జమీన్ కా కానూనీ హక్: అటవీ హక్కుల చట్టం కింద వచ్చే క్లెయిమ్స్ ఏడాదిలోపే పరిష్కారం 
    అప్నీ ధర్తీ, అప్నా రాజ్: ఎస్టీలు అత్యధికంగా ఉన్న ఆవాసాలు షెడ్యూల్డ్ ఏరియాలుగా ప్రకటన