కాంగ్రెస్​ మూడో​ లిస్టు రిలీజ్​..తెలంగాణలో ఐదు సీట్లకు అభ్యర్థులు ఖరారు

కాంగ్రెస్​ మూడో​ లిస్టు రిలీజ్​..తెలంగాణలో ఐదు సీట్లకు అభ్యర్థులు ఖరారు
  • పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ.. మల్కాజ్​గిరి నుంచి పట్నం సునీతారెడ్డి
  • సికింద్రాబాద్​ బరిలో దానం నాగేందర్​.. చేవెళ్ల బరిలో రంజిత్​రెడ్డి
  • మల్లు రవికి నాగర్​కర్నూల్​ టికెట్​.. ఇప్పటికే ఫస్ట్​ లిస్టులో 4 సీట్లకు ప్రకటన
  • హోలీ తర్వాత మరో ఎనిమిది సీట్లపై నిర్ణయం

న్యూఢిల్లీ, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మూడో లిస్టును కాంగ్రెస్​ పార్టీ రిలీజ్​ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 57 సీట్లకు క్యాండిడేట్ల పేర్లను ఇందులో ప్రకటించింది. తెలంగాణ నుంచి ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణకు టికెట్​ కన్ఫామ్​ చేసింది. అతిపెద్ద లోక్​సభ నియోజకవర్గమైన మల్కాజ్​గిరి టికెట్​ను పట్నం సునీతా మహేందర్​రెడ్డికి, సికింద్రాబాద్​ టికెట్​ను దానం నాగేందర్​కు ఓకే చేసింది. చేవెళ్ల నుంచి రంజిత్​రెడ్డిని, నాగర్​కర్నూల్​ నుంచి మల్లు రవిని బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో 17 లోక్​సభ స్థానాలు ఉండగా.. ఈ నెల 8న ప్రకటించిన లిస్టులో 
4 సీట్లకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. 

కర్నాటకలో 17 సీట్లకు

కాంగ్రెస్​ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ గురువారం దేశవ్యాప్తంగా 57 మంది అభ్యర్థులతో థర్డ్​ లిస్టును విడుదల చేశారు. ఇందులో కర్నాటకలో 17 సీట్లకు, గుజరాత్​లో 11 సీట్లకు, మహారాష్ట్రలో 7 సీట్లకు, పశ్చిమ బెంగాల్​లో 8 సీట్లకు, తెలంగాణలో 5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్​లో 2 సీట్లకు, పుదుచ్చేరిలో ఒక్క సీటుకు కూడా క్యాండిడేట్లను అనౌన్స్​ చేశారు. రాజస్థాన్​లో 6 సీట్లకు గాను ఐదు సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్​ పార్టీ.. మరో సీటును సీపీఎంకు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. 

తాజా జాబితాతో కలిపి (మొత్తం మూడు లిస్టులు) కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 139 మంది అభ్యర్థులను ప్రకటించింది.

సామాజిక సమీకరణలు, విన్నింగ్​ పర్సంటేజీ ఆధారంగా..!

ఎంపీ అభ్యర్థుల ఖరారుపై ఏఐసీసీ చీఫ్  ఖర్గే నేతృ త్వంలో జరిగిన తొలి భేటీలో తెలంగాణలోని 17 స్థానాలకు గాను.. 10 సీట్లపై  చర్చ జరిగింది‌. అయి తే ఈ నెల 8న ఫస్ట్​ లిస్టును విడుదల చేయగా.. ఇందులో తెలంగాణ నుంచి 4 స్థానాలకే క్యాండిడేట్లను  ప్రకటించారు. వీరిలో మహబూబ్​నగర్​ నుంచి వంశీచంద్​రెడ్డి, మహబూబాబాద్​ నుంచి బలరాం నాయక్​, జహీరాబాద్​ నుంచి సురేశ్​ షెట్కార్​, నల్గొండ నుంచి రఘువీర్​రెడ్డి పేర్లను అనౌన్స్​ చేశారు. 

మిగితా స్థానాలపై పలు దఫాలు చర్చలు జరిగాయి. సామాజిక సమీకరణలు, విన్నింగ్​ పర్సంటేజీని పరిగణనలోకి తీసుకొని సీడబ్ల్యూసీ, పార్టీ సీఈసీ మీటింగ్​లో పార్టీ పెద్దలు మంతనాలు జరిపారు. గురువారం విడుదలైన లిస్టులో తెలంగాణ నుంచి ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందులో  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి కుమారుడు, యువనేత గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి టికెట్​ ఓకే అయింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్​లో చేరిన ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్ , చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డికి సెకండ్​ లిస్టులో చోటుదక్కింది. నాగర్ కర్నూల్ బరిలో నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మాజీ ఎంపీ మల్లు రవి వైపే అధిష్టానం మొగ్గు చూపించింది. 

హోలీ తర్వాతే నెక్ట్ లిస్ట్ 

తెలంగాణలోని మిగిలిన 8 స్థానాలపై హోలీ తర్వాత మరోసారి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. భువనగిరి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, ఖమ్మం, వరంగల్ స్థానాలకు ఇందులో అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.  

పెద్దపల్లి: గడ్డం వంశీకృష్ణ

కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి మనుమడు గడ్డం వంశీకృష్ణ. చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, సరోజ దంపతులకు ఆయన పెద్ద కుమారుడు. తాత, తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లో ప్రవేశించిన వంశీకృష్ణ.. పెద్దపల్లి లోక్​సభ స్థానం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. నాలుగు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గం నుంచి వివేక్​వెంకటస్వామి విజయం సాధించడంలో గడ్డం వంశీకృష్ణ  క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో కేడర్​ను సమీకరించడంలో, ప్రచార వ్యూహాలు రచించి, అమలుచేయడంలో సక్సెస్​ అయ్యి కాంగ్రెస్​ హైకమాండ్​ దృష్టిలో పడ్డారు. 

విశాక ఇండస్ట్రీస్ జేఎండీగా ఉన్న గడ్డం వంశీకృష్ణ.. యువ ఆవిష్కర్తగా, బిల్డింగ్​ మెటీరియల్​ప్రొవైడర్​గా  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2011లో విశాక ఇండస్ట్రీలో మేనేజ్​మెంట్​ ట్రైనీగా చేరి, 2012 నాటికే ప్రధాన వ్యాపార వ్యూహకర్తగా ఎదిగారు.  2014 నుంచి 2017 వరకు డైరెక్టర్​గా,  ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో ఇన్నోవేషన్స్ తో ప్రజల ముందుకు వచ్చారు. 

వీ నెక్ట్స్, ఆటం, సోలార్ రూప్ లాంటి ఆవిష్కరణలకు ఇండియాతో పాటు విదేశాల్లో పేటెంట్ పొందారు. పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూనే వ్యాపార రంగంలో రాణిస్తున్నారు.  సామాజిక సేవరంగంలోనూ గడ్డం వంశీకృష్ణ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో విశాక ఇండస్ట్రీస్​తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో ఆదరణ పొందారు.   తాజాగా రాజకీయాల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైన ఆయనకు టికెట్​ దక్కడంతో కాకా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. 

నాగర్​కర్నూల్​: మల్లు రవి

ఖమ్మం జిల్లా స్నానాల లక్ష్మీపురంలో 1950 జులై 14న మల్లు రవి జన్మించారు. ప్రస్తుతం ఆయన పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​గా ఉన్నారు. హైదరాబాద్​లోని గాంధీ మెడికల్​ కాలేజీలో ఎంబీబీఎస్​ డీఎల్​వో పట్టా పొందిన మల్లు రవి.. 1980లో కాంగ్రెస్​లో యూత్​ కాంగ్రెస్​ డాక్టర్స్​ వింగ్​ కన్వీనర్​గా తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. రెండు సార్లు ఎంపీగా, ఓ సారి ఎమ్మెల్యేగా చట్టసభల్లో అడుగుపెట్టారు. 

తొలిసారిగా 1991లో నాగర్​కర్నూల్​ ఎంపీగా గెలిచారు. 1998లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఎంపీగా విజయం సాధించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2014, 2019లో నాగర్​కర్నూల్​ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం మరోసారి కాంగ్రెస్​ పార్టీ నుంచి నాగర్​కర్నూల్​ టికెట్ మల్లు రవికి దక్కింది. 1991 నుంచి 1999 మధ్య కాలంలో పెట్రోలియం అండ్​ నాచురల్​ గ్యాస్​, కెమికల్స్​ అండ్​ ఫర్టిలైజర్స్​ కమిటీలు, సంప్రదింపుల కమిటీ, సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ, వాణిజ్య శాఖ వంటి కమిటీల్లో సభ్యుడిగానూ ఆయన పనిచేశారు. 

మల్కాజ్​గిరి: పట్నం సునీతా మహేందర్​ రెడ్డి

పట్నం సునీతా మహేందర్ రెడ్డి మొదటిసారి ఎంపీ క్యాండిడేట్​గా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆమె వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నారు. గత నెలలో సీఎం రేవంత్​ రెడ్డిని కలిసి ఆమె బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరారు. 1974 నవంబర్​ 25న   సంగారెడ్డి జిల్లా డాకూర్ గ్రామంలో సునీత జన్మించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1995 జులై 16న పట్నం మహేందర్​రెడ్డితో ఆమెకు వివాహం జరిగింది. 2006లో టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. రెండు సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్​పర్సన్​గా పనిచేశారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. 

సికింద్రాబాద్‌: దానం నాగేందర్‌

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ను కాంగ్రెస్‌ పార్టీ సికింద్రాబాద్‌ లోక్​సభ అభ్యర్థిగా ప్రకటించింది. 2004లో ఆసిఫ్‌నగర్‌ ఎమ్మెల్యేగా, 2009, 2018, 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌ లో చేరారు. 2002లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎంసీహెచ్‌) మేయర్‌గా పోటీ చేసిన దానం నాగేందర్‌.. టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన తీగల కృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. 

2004లో టీడీపీలో చేరి ఆసీఫ్​నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2018లో ఖైరతాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ సీఎం వైఎస్​ఆర్ ప్రభుత్వంలో కార్మిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో ఖైరతాబాద్​లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో అప్పటి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

చేవెళ్ల: గడ్డం రంజిత్ రెడ్డి

చేవెళ్ల సిట్టింగ్​ ఎంపీ అయిన గడ్డం రంజిత్​రెడ్డి 1964  సెప్టెంబర్ 18న వరంగ్​లో జన్మించారు. ఆయన ఫౌల్ర్టీ బిజినెస్ మన్. రాజేంద్ర నగర్ లోని  అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ( ఎంవీఎస్సీ ) పట్టా అందుకున్నారు. ఫ్రౌల్ట్రీ రంగానికి టెక్నికల్ అడ్వైజర్ గా పనిచేశారు. 1990లో ఎస్ ఆర్ హ్యాచరీస్ ప్రారంభించారు. అనంతరం స్టేట్ ఫౌల్ట్రీ అసోసియేషన్ లో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన భార్య  గడ్డం సీతారెడ్డి. వీరికి ఒక పాప, ఒక బాబు. 2019లో చేవేళ్ల నుంచి బీఆర్ ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఈ నెల 17న కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్​ దీప్ దాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో  ఆయన కాంగ్రెస్​లో చేరారు.