రెండు, మూడు రోజుల్లో తెలంగాణ కోర్ కమిటీ భేటీ

రెండు, మూడు రోజుల్లో తెలంగాణ కోర్ కమిటీ భేటీ
  • మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై చర్చ
  • కేసీతో పీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ
  • కొత్త కమిటీ కూర్పుపై నివేదిక అందజేత

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ అధిష్టానం ఆ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రెండు, మూడు రోజుల్లో తెలంగాణ కోర్ కమిటీ భేటీ నిర్వహించాలని నిర్ణయించింది. మంత్రివర్గ విస్తరణతో పాటు దాదాపు 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించనుంది. బుధవారమే ఈ భేటీ ఉంటుందని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​ గౌడ్​కు పార్టీ నుంచి సమాచారం అందించింది. అయితే ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ మీటింగ్ ను పార్టీ అధిష్టానం క్యాన్సిల్ చేసింది. అప్పటికే మంత్రి ఉత్తమ్, మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ చేరుకోగా.. సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటన చివరి నిమిషంలో నిలిచిపోయాయి.

కాగా.. పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. పీసీసీ కొత్త కమిటీ కూర్పుపై నివేదిక అందించారు. ఏయే కమిటీల్లో ఎవరికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది, సామాజిక సమతుల్యత, ఇతర అంశాలను ఆ రిపోర్ట్ లో పొందుపరిచినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణపైన కూడా తన అభిప్రాయాన్ని అధిష్టానం ముందు పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ, కూర్పుపై అధిష్టానం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్, పీసీసీ, ఇన్​చార్జ్​ల అభిప్రాయాలు తీసుకుంది. అయితే, అనివార్య కారణాల వల్ల రెండుసార్లు మంత్రి వర్గ విస్తరణ వాయిదా వేసింది.

ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఉండగా.. సామాజిక సమతుల్యంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి కమ్యూనిటీకి ఒక్కో మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అలాగే సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించిన తర్వాత పీసీసీ కొత్త కమిటీపై ప్రకటించే చాన్స్ ఉంది. ఇందులో నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు కల్పించబోతున్నట్టు సమాచారం.