నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తది

నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తది

టీఆర్ఎస్ పార్టీలోకి వెళితే.. తనకు మంత్రి పదవి వచ్చేదని..అంతేగాకుండా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చెయ్యడం ఇష్టం లేక టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లలేదన్నారు. జూలై 14వ తేదీ గురువారం నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన, ఫిల్టర్ వాటర్ ప్లాంటులను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేస్తే తనకు పేరు వస్తుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని అందుకే దానిని పూర్తి చేయడం లేదని ఆరోపించారు. ఇంత వర్షం వచ్చినా ఈ ప్రాజెక్ట్ కు చుక్క నీరు రాలేదని తెలిపిన ఆయన లక్షనర కోట్ల రూపాయలను కాళేశ్వరం పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు.

మానవత్వం ఉంటే ఇప్పటికైనా ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలని సూచించారు. నీళ్లున్న ప్రాంతంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కడుతున్నారని విమర్శించారు. శ్రీశైల సొరంగ మార్గం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పనులు పూర్తి చెయ్యలేదు కాబట్టే నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఎవరు ఎన్ని తప్పుడు సర్వేలు రాయించుుకున్నా.. కాంగ్రెస్ పార్టీపై ఆదరణ ఉందని చెప్పుకొచ్చారు. ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తామని అంటున్నారని, తెలంగాణ ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకోవాలని ప్రజలు చూస్తున్నట్లు తెలిపారు. స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ మొత్తం పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా తాను కృషి చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.