రాజస్థాన్​ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుతం: కాంగ్రెస్

రాజస్థాన్​ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుతం: కాంగ్రెస్
  •     గెహ్లాట్, పైలట్​ ఇందుకు అంగీకరించారని కాంగ్రెస్ వెల్లడి
  •     ఇరువురు నేతలతో పార్టీ చీఫ్​ ఖర్గే, మాజీ చీఫ్​ రాహుల్ గాంధీ భేటీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో జరిగే రాజస్థాన్  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై కలిసికట్టుగానే పోరాడుతామని కాంగ్రెస్  పార్టీ పేర్కొంది. సీఎం అశోక్  గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్  పైలట్ మధ్య  ఇటీవల విభేదాలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ పంచాయితీని పక్కన పెట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై పోరాడే విషయంలో ఐక్యంగా ఉండాలన్న పార్టీ ప్రతిపాదనకు వారిద్దరూ అంగీకరించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మాజీ సీఎం వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతి, రాజస్థాన్ పబ్లిక్  సర్వీస్  కమిషన్(ఆర్ పీఎస్సీ) పేపర్ల లీకేజీపై ఈ నెలలోపు ఎంక్వయిరీ జరిపించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తానని పైలట్  ఇప్పటికే గెహ్లాట్  ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో కాంగ్రెస్  పార్టీ చీఫ్​ మల్లికార్జున్  ఖర్గే, మాజీ చీఫ్​ రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. గెహ్లాట్, పైలట్ తో ఖర్గే, రాహుల్ వేర్వేరుగా 2 గంటల పాటు చర్చించారు. సోమవారం రాత్రి ఖర్గే నివాసంలో ఈ భేటీ జరిగింది. అయినప్పటికీ, వారి మధ్య సయోధ్య కుదర్చలేకపోయినట్లు సమాచారం. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడేందుకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​తో గెహ్లాట్, పైలట్  బయటకు వచ్చారు. అయితే, వేణుగోపాల్  తప్ప ఆ ఇద్దరు మాట్లాడలేదు. ఖర్గే, రాహుల్​తో నిర్వహించిన చర్చలు సక్సెస్  అయిన ఆనవాళ్లు వారి ముఖంపై కనిపించలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

పైలట్  డిమాండ్లపై సైలెంట్!

మాజీ సీఎం వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని సచిన్  పైలట్  ప్రధానంగా డిమాండ్  చేస్తున్నారు. అయితే, మల్లికార్జున్  ఖర్గే, రాహుల్  గాంధీ తమతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై మాట్లాడలేదని పైలట్  వర్గాలు తెలిపాయి. అలాగే ఆర్ పీఎస్సీని కొత్తగా ఏర్పాటు చేయాలని, పేపర్ల లీకేజీ తర్వాత పరీక్షలు రద్దయి నిరుద్యోగులు నష్టపోయిన నేపథ్యంలో వారికి నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్లపైనా హైకమాండ్  నుంచి ఎలాంటి హామీ రాలేదని పైలట్  వర్గాలు పేర్కొన్నాయి. తన డిమాండ్లపై స్పందించకపోతే తాను అనుకున్నది చేస్తానని పైలట్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.