రైతులకు ఒకేసారి రూ.రెండు లక్షల రుణమాఫీ : ఏనుగు రవీందర్ రెడ్డి

రైతులకు ఒకేసారి రూ.రెండు లక్షల రుణమాఫీ : ఏనుగు రవీందర్ రెడ్డి

కోటగిరి, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  రైతులకు ఏకకాలంలో రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన కోటగిరి, పొతంగల్ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తండాల్లో లంబాడాలు మంగళహారతులు, నృత్యాలతో ఏనుగు రవీందర్ రెడ్డికి స్వాగతం పలికారు. సుద్దులం తండాకు చెందిన లంబాడా మహిళలు చందాలు వేసుకొని ఏనుగు రవీందర్ రెడ్డికి ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఏనుగు మాట్లాడుతూ.. కేసీఆర్ గత ఎన్నికల సందర్భంగా రూ. లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి, పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. మహిళలకు ప్రతినెలా రూ.2500 పింఛన్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.15 ఇస్తామన్నారు. పోడు రైతులకు 2005 అటవీ చట్టం ప్రకారం పట్టాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో కోటగిరి, పొతంగల్ మండలాధ్యక్షులు షాహిద్, పుప్పాల శంకర్, డీసీసీ డెలిగేట్ ఎలమంచిలి శ్రీనివాస్, ఎంపీటీసీ కొట్టం మనోహర్, కొత్తపల్లి విండో చైర్మన్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.