పాలమూరు-రంగారెడ్డి శిలాఫలకం దగ్గర..కాంగ్రెస్ ​నాయకుల నిరసన

పాలమూరు-రంగారెడ్డి శిలాఫలకం దగ్గర..కాంగ్రెస్ ​నాయకుల నిరసన

భూత్పూర్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి ఎనిమిదేండ్లయిందని, ఇప్పటి వరకు 40శాతం పనులు కూడా జరగలేదని పాలమూరు పునర్నిర్మాణ ఫోరం అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. పథకానికి శంకుస్థాపన చేసి ఆదివారానికి ఎనిమిదేండ్లయిన సందర్భంగా భూత్పూర్ మండలం కర్వెన వద్దనున్న శిలాఫలకం వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. కాగా, కర్వెనకు వస్తున్న హర్షవర్ధన్​ రెడ్డిని, ఇతర కాంగ్రెస్ నాయకులను పోలీసులు భూత్పూర్ వద్ద అడ్డుకుని అరెస్ట్​చేశారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్​రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వచ్చినప్పుడల్లా ఆ నెలా, ఈ నెలా పూర్తి చేస్తామంటూ మభ్యపెడుతున్నారన్నారు. 

పాలమూరు ప్రాజెక్టు అనేది సాగునీటి ప్రాజెక్టుగా కాకుండా తాగునీటి ప్రాజెక్టుగా దరఖాస్తు చేసుకున్నారని, దాన్ని సాగునీటి ప్రాజెక్టుగా ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ప్రాజెక్టుపై నేషనల్ ​గ్రీన్ ​ట్రిబ్యునల్​లో ఏపీ ఫిర్యాదు చేయగా స్టే వచ్చిందన్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో స్టే వస్తే ఇప్పటి దాకా  ప్రభుత్వం వేకెట్ చేయించడానికి కనీస ప్రయత్నం చేయలేదన్నారు. ప్రతి ఎన్నికలప్పుడు ఈ ప్రాజెక్టు పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు. తిరుపతిరెడ్డి, బిక్షపతి, నరేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఇస్మాయిల్, నారాయణగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మదిగట్ల గ్రామ లక్ష్మీకాంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.