రాజకుటుంబానికే పదవులు, గుర్జర్లకు అవమానం: ప్రధాని మోదీ

 రాజకుటుంబానికే పదవులు, గుర్జర్లకు అవమానం: ప్రధాని మోదీ

జైపూర్: కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్​లో గుర్జర్లను అవమానిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. ఆ పార్టీ రాజేశ్ పైలట్ పై చూపించిన ద్వేషాన్నే ఆయన కొడుకు సచిన్ పైలట్ పైనా చూపిస్తోందని ఆరోపించారు. ఇదే విషయంపై తాను అంతకుముందు రోజు ప్రశ్నించినప్పటికీ కాంగ్రెస్ సమాధానం దాటవేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చేదాకా వాడుకుని, ఆపై పాలల్లో పడ్డ ఈగను తీసేసినట్లే నాయకులను గెంటేస్తారని విమర్శించారు. గురువారం రాజస్థాన్​లోని రాజ్​సముంద్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకోసం జీవితాన్ని అంకితం చేసిన గుర్జర్ బిడ్డ రాజేశ్ పైలట్​ను ఆ పార్టీ పక్కనపెట్టిందన్నారు. ఆయన కొడుకు సచిన్ పైలట్ విషయంలోనూ అదే జరుగుతోందన్నారు. సీఎం అశోక్ గెహ్లాట్​పై తిరుగుబాటు చేసినందుకు సచిన్​ పైలట్  కాంగ్రెస్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పదవులను కోల్పోయాడన్నారు. తండ్రి రాజేశ్ తిరుగుబాటు కారణంగానే సచిన్ పైలట్‌‌ను కాంగ్రెస్ బలిపశువును చేసిందని ఆరోపించారు.

రాజకుటుంబానికే పదవులు దక్కుతాయన్నారు.
కాంగ్రెస్​లో ఖర్గేకూ అవమానమే..

జైపూర్​లో రోడ్​ షో సందర్భంగా గోడలపై కాంగ్రెస్ పోస్టర్లు కూడా కనిపించాయని, అందులో ఎక్కడా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫొటోను తాను చూడలేదని ప్రధాని మోదీ అన్నారు. ‘‘కాంగ్రెస్ పోస్టర్లపై గెహ్లాట్ ఉంటారు. రాజకుటుంబానికి చెందిన వారసులుంటారు. కానీ, ఖర్గే ఫొటోలు కనిపించవు. దళిత తల్లి కొడుకు విషయంలో కాంగ్రెస్ ఇలాగేనా వ్యవహరించేది?”అని మోదీ ప్రశ్నించారు. రాజస్థాన్​లో దళిత, గుర్జర్ల వ్యతిరేక ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేదని అన్నారు. ‘‘భూమి, నీరు, నింగి ఏదయినాసరే కాంగ్రెస్ ఒక్క పంజా చాలు దోచేందుకు”అని మోదీ ఆరోపించారు. రాజస్థాన్​లో బీజేపీ చేస్తున్న మంచి పనులన్నింటినీ ఐదేండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆపేసిందన్నారు. కానీ ఇప్పుడు గెలవబోయే బీజేపీ మాత్రం అలా చేయబోదన్నారు. అవినీతి దారులన్నీ మూసేసి, అన్ని పథకాలు కొనసాగిస్తామని, ప్రజా సంక్షేమమే టార్గెట్​గా పనిచేస్తామని మోదీ చెప్పారు. చత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అన్నారు.

ప్రధాని మోదీ చెప్పేవన్నీ  అబద్ధాలే: కాంగ్రెస్

ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్లను కాంగ్రెస్ కొట్టిపారేయగా సచిన్ పైలట్ ట్విట్టర్​లో స్పందించారు. తన తండ్రి జీవితకాలం పార్టీకి అంకితమైన కాంగ్రెస్ వాది అని, మోదీ మాటల్లో వాస్తవం లేదని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే పీఎం ఇలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.