సచిన్‌పైలెట్‌పై యాక్షన్‌ తీసుకున్న కాంగ్రెస్‌

సచిన్‌పైలెట్‌పై యాక్షన్‌ తీసుకున్న కాంగ్రెస్‌
  • డిప్యూటీ సీఎం పదవికి ఉద్వాసన
  • పీసీసీ అధ్యక్షుడిగా కూడా తొలగించిన పార్టీ
  • ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులపై వేటు

జూపూర్‌‌: రాజస్థాన్‌ రాజకీయం మరింత రసవత్తరంగా మారతోంది. సొంత పార్టీపైనే తిరుగుబాటు చేసిన సచిన్‌పైలెట్‌ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్‌ తీర్మానం చేసింది. పీసీసీ పదవి నుంచి కూడా తొలగిస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులపై కూడా చర్యలు తీసుకున్నారు. పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఈ విషయాన్ని ప్రకటించారు. వరుసగా రెండోసారి పార్టీ సీఎల్పీ సమావేశానికి హాజరు కాకపోవడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సచిన్‌, ఆయన అనుచరులకు ఉద్వాసన పలకాలని సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారని సమాచారం. గోవింద్‌ సింగ్‌ను రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. 2018 రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. అయితే పార్టీ గెలుపుకు కృషి చేశానని, తనకు సీఎం పదవి ఇవ్వాలని సచిన్‌ పైలెట్‌ అధిష్టానాన్ని కోరగా.. దానికి ఒప్పుకోలేదు. సీనియర్ నేత అశోక్‌ గెహ్లాట్‌కు సీఎం పదవి ఇచ్చి సచిన్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. దీంతో అసంతృప్తితో ఉన్న సచిన్‌కు మొదటి నుంచి గెహ్లాట్‌తో పడలేదు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీతో కాంటాక్ట్‌లో ఉన్నారని, దాదాపు 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో చేరి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నికూల్చాలని చూస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్‌ నేతలు ప్రియాంక, రాహుల్‌ పైలెట్‌తో మాట్లాడినప్పటికీ ఆయన వినలేదు. సీఎల్పీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. ఆయన మద్దతుదారులను ఒక హోటల్‌లో ఉంచారు. తనకు మద్దతు ఉందని నిరూపించుకనేందుకు సచిన్‌ పైలెట్‌ కొన్ని వీడియోలను కూడా రిలీజ్‌ చేశారు.

ఫ్లోర్‌‌ టెస్ట్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బీజేపీ

కాంగ్రెస్‌ ఏర్పడ్డ పరిస్థితులను బీజేపీ క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఫ్లోర్‌‌ టెస్ట్‌కు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గెహ్లాట్‌ ప్రభుత్వానికి సరైన బలం లేదని దానికి ఫ్లోర్‌‌ టెస్ట్‌కు వెళ్లే ఎవరి బలం ఏంటో తెలుస్తుందని బీజేపీ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజస్థాన్‌ బీజేపీ ఇంచార్జ్‌ ఓం మాథుర్‌‌ కూడా మీటింగ్‌ను నిర్వహించేందుకు జైపూర్‌‌ బయలుదేరి వెళ్లారని కార్యకర్తలు చెప్పారు. కాగా.. మొదటి నుంచి పైలెట్‌ బీజేపీతో టచ్‌లో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ హై లెవల్‌ మీటింగ్‌ పెట్టడం గమనార్హం.