21 మంది రెడ్లు, 8 మంది బీసీలు.. 45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్

21 మంది రెడ్లు, 8 మంది బీసీలు..  45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్
  • 45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్
  • 21 మంది రెడ్లకు, 8 మంది బీసీలకు చాన్స్
  •  ఎస్టీలకు 6, ఎస్సీలకు 3, కమ్మ వర్గానికి 3, వెలమలకు 2, 
  • బ్రాహ్మణులు, మైనార్టీలకు చెరొకటి.. 
  • ఇతర పార్టీల నుంచి వచ్చిన 15 మందికి టికెట్
  • కంటోన్మెంట్ నుంచి గద్దర్ కూతురు వెన్నెల, ఎల్బీ నగర్‌‌‌‌ నుంచి మధు యాష్కీ, ఖమ్మం నుంచి తుమ్మల, పాలేరు నుంచి పొంగులేటి పోటీ
  • మునుగోడు నుంచి రాజగోపాల్‌‌రెడ్డి, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్‌‌..
  • కమ్యూనిస్టులకు 4 సీట్లు.. పెండింగ్​లో మిగతా 15 స్థానాలు 

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్టును ప్రకటించింది. 45 మంది అభ్యర్థులతో శుక్రవారం రాత్రి జాబితాను విడుదల చేసింది. రెడ్లకు 21 సీట్లను, బీసీలకు 8 స్థానాలను, ఎస్టీలకు 6, ఎస్సీలకు 3, కమ్మ సామాజిక వర్గానికి 3, వెలమలకు రెండు, బ్రాహ్మణులకు ఒకటి, మైనార్టీలకు ఒక స్థానాన్ని కేటాయించింది. ఇటీవల కొత్తగా చేరిన 15 మంది నేతలకు టికెట్లను కన్ఫమ్ చేసింది. తొలి జాబితాలోని 55 మందితో కలిపి ఇప్పటివరకు 100 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తంగా ఈ వంద సీట్లలో రెడ్లకు 38, బీసీలకు 20 స్థానాలను పార్టీ ఇచ్చింది. సెకండ్​ లిస్ట్​లో  గద్దర్ కూతురు వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డికి మునుగోడు, పొన్నం ప్రభాకర్‌‌‌‌కు హుస్నాబాద్, మధు యాష్కీ గౌడ్‌‌కు ఎల్బీ నగర్‌‌‌‌ సీటును కేటాయించింది.​

రెండో జాబితాలోనూ బీసీలకు తక్కువ సీట్లనే కాంగ్రెస్ కేటాయించింది. 45 స్థానాల్లో కేవలం 8 స్థానాలను ఇచ్చింది. కొండా సురేఖ (వరంగల్ ఈస్ట్), వాకిట శ్రీహరి (మక్తల్), జగదీశ్వర్ గౌడ్ (శేరిలింగంపల్లి), కస్తూరి నరేందర్ (రాజేందర్ నగర్), మధు యాష్కి గౌడ్ (ఎల్బీనగర్), పూజల హరికృష్ణ (సిద్దిపేట), పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్), నారాయణ రావు పటేల్ (ముధోల్)లను రెండో జాబితాలో ప్రకటించింది. ఇక ప్రకటించాల్సిన 19 సీట్లలో కమ్యూనిస్టులకు నాలుగు సీట్లు పోను.. మిగతా 15 సీట్లలో 9 జనరల్ స్థానాలున్నాయి. అందులో బీసీలకు మరో నాలుగు స్థానాలను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తున్నది.

కామారెడ్డి, సిరిసిల్ల బరిలో నిలిచేదెవరు?

కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించలేదు. వాస్తవానికి కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ బరిలో ఉన్నందున.. అక్కడి నుంచి షబ్బీర్ అలీ బరిలో నిలవాలని భావించడం లేదు. అక్కడ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోటీ చేయాల్సిందిగా అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై రేవంత్ కూడా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్‌కు పంపించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అక్కడ పోటీ చేయాలని భావించిన మహేశ్ కుమార్ గౌడ్‌ను ఢిల్లీకి పిలిచి కన్విన్స్ చేశారని సమాచారం. నిజామాబాద్ అర్బన్ సీటును ముస్లిం లీడర్‌‌కు ఇస్తారని హైకమాండ్ చెప్తున్నది. దీంతో దాదాపు షబ్బీర్​కే ఇస్తారన్న ప్రచారం జరుగుతున్నది. మరోవైపు సిరిసిల్ల అభ్యర్థినీ ఫైనల్ చేయలేదు. 
మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో కేకే మహేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా.. ఉత్తమ్‌ను బరిలోకి దింపాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్నీ పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. పార్టీ ఆదేశిస్తే గజ్వేల్​ నుంచి కూడా బరిలోకి దిగుతానని రాజగోపాల్ రెడ్డి చెప్పినా.. లిస్టులో మునుగోడు నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేశారు. గజ్వేల్ గురించి మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే ఆ స్థానం నుంచి నర్సారెడ్డిని తొలి జాబితాలో పార్టీ ప్రకటించింది.

ఆశావహుల పరిస్థితేంది?

కొన్ని ముఖ్యమైన స్థానాల్లో పోటీలో ఉన్న ప్రముఖ నేతలకు రెండో జాబితాలో నిరాశే ఎదురైంది. ఖానాపూర్ టికెట్‌ కోసం అప్లై చేసుకున్న రేఖా నాయక్‌కు టికెట్ దక్కలేదు. జూబ్లీహిల్స్ స్థానాన్ని ఆశించిన విష్ణువర్ధన్​ రెడ్డికీ నిరాశే మిగిలింది. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బల్మూరి వెంకట్‌కూ టికెట్​ నిరాకరించారు. అంబర్‌‌పేటలో లక్ష్మణ్ యాదవ్, నూతి శ్రీకాంత్ గౌడ్ పోటీలో ఉన్నా.. వారికి దక్కలేదు. ఎల్లారెడ్డి నుంచి సుభాష్​ రెడ్డికి ఇవ్వలేదు. ఎల్బీ నగర్ నుంచి టికెట్ కోసం చివరిదాకా ప్రయత్నించిన మల్​రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్​రెడ్డి.. హుస్నాబాద్ టికెట్ ఆశించిన ప్రవీణ్ రెడ్డి, సిద్దిపేట టికెట్‌కు అప్లై చేసుకున్న భవానీ రెడ్డికి చాన్స్ రాలేదు. ఆదిలాబాద్‌లో ఎప్పట్నుంచో పార్టీలో ఉండి టికెట్ ఆశించిన గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, ఆసిఫాబాద్ నుంచి మర్సుకోల సరస్వతి, మక్తల్​లో ఎర్ర శేఖర్, వనపర్తిలో శివశంకర్ రెడ్డి, మేఘారెడ్డి, మహబూబాబాద్​లో బలరాం నాయక్​, మునుగోడు రేసులో ఉన్న పాల్వాయి స్రవంతి, చెలమల కృష్ణా రెడ్డి, పున్నా కైలాష్​లకూ నిరాశే ఎదురైంది. పినపాక నుంచి అప్లై చేసుకున్న సీతక్క కుమారుడు సూర్యంకీ టికెట్ దక్కలేదు. వరంగల్ వెస్ట్​లో జంగా రాఘవ రెడ్డికి సీటివ్వలేదు. మహేశ్వరం టికెట్ కన్ఫర్మ్ అనుకున్న బడంగ్​పేట్ మేయర్ పారిజాతా రెడ్డికి టికెట్‌ రాలేదు.

రెండో లిస్టు

నియోజకవర్గం    అభ్యర్థి
సిర్పూర్‌         రావి శ్రీ‌నివాస్‌ 
ఆసిఫాబాద్ (ఎస్టీ)    అజ్మీరా శ్యామ్‌
ఖానాపూర్ (ఎస్టీ)     వెడ్మ బొజ్జు
ఆదిలాబాద్‌         కంది శ్రీ‌నివాస‌రెడ్డి
బోథ్​ (ఎస్టీ)        వెన్నెల అశోక్‌
ముథోల్‌        నారాయ‌ణ రావ్ పాటిల్‌ 
ఎల్లారెడ్డి        కె. మ‌ద‌న్‌మోహ‌న్‌రావు 
నిజామాబాద్ రూర‌ల్‌     రేచుల‌ప‌ల్లి భూప‌తిరెడ్డి
కోరుట్ల            జువ్వాడి నర్సింగ రావు 
చొప్పదండి (ఎస్సీ)    మేడిపల్లి సత్యం
హుజూరాబాద్​    వొడితెల ప్రణవ్​ 
హుస్నాబాద్​        పొన్నం ప్రభాకర్​
సిద్దిపేట        పూజల హరికృష్ణ 
నర్సాపూర్​        ఆవుల రాజిరెడ్డి
దుబ్బాక            చెరుకు శ్రీనివాస్​ రెడ్డి
కూకట్​పల్లి        బండి రమేశ్​
ఇబ్రహీంపట్నం    మల్​రెడ్డి రంగా రెడ్డి 
ఎల్బీ నగర్​        మధు యాష్కీ గౌడ్​
మహేశ్వరం        కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
రాజేంద్రనగర్​        కస్తూరి నరేందర్​ 
శేరిలింగంపల్లి    వి. జగదీశ్వర్​ గౌడ్​ 
తాండూర్​        బుయ్యని మనోహర్​ రెడ్డి
అంబర్​పేట        రోహిన్​ రెడ్డి
ఖైరతాబాద్        పి. విజయా రెడ్డి
జూబ్లీహిల్స్​        అజారుద్దీన్​
కంటోన్మెంట్​(ఎస్సీ)    జీవీ వెన్నెల
నారాయణ్​పేట్​    పర్ణిక రెడ్డి చిట్టెం
మహబూబ్​నగర్​    యెన్నం శ్రీనివాస్​ రెడ్డి
జడ్చర్ల            అనిరుధ్​ రెడ్డి
దేవరకద్ర        గవినోళ్ల మధుసూదన్​ రెడ్డి
మక్తల్​            వాకిటి శ్రీహరి 
వనపర్తి            జిల్లెళ్ల చిన్నారెడ్డి
దేవరకొండ (ఎస్టీ)    నేనావత్​ బాలూ నాయక్​
మునుగోడు        కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి
భువనగిరి        కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి
జనగామ        కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి
పాలకుర్తి        యశశ్విని మేమిడిల
మహబూబాబాద్​ (ఎస్టీ)    మురళీ నాయక్​
పరకాల        రేవూరి ప్రకాశ్​ రెడ్డి
వరంగల్​ వెస్ట్​        నాయని రాజేందర్​ రెడ్డి
వరంగల్​ ఈస్ట్​    కొండా సురేఖ
వర్ధన్నపేట (ఎస్సీ)    కేఆర్​ నాగరాజు
పినపాక (ఎస్టీ)    పాయం వెంకటేశ్వర్లు
ఖమ్మం            తుమ్మల నాగేశ్వరరావు
పాలేరు        పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి