రేపు బీజేపీ నేతలతో ఢిల్లీకి మర్రి శశిధర్​ రెడ్డి.. 25న కమల దళంలోకి చేరిక

రేపు బీజేపీ నేతలతో ఢిల్లీకి మర్రి శశిధర్​ రెడ్డి..  25న కమల దళంలోకి చేరిక

తెలంగాణ బీజేపీ నేతలు రేపు (బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితర నేతలు హస్తినకు వెళ్తున్నారు. వారితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా దేశ రాజధానికి వెళ్లనున్నారు.

25న (శుక్రవారం రోజు) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ  నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ లో చేరనున్నారు.  బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ బీఎల్ సంతోష్ కు సిట్​నోటీసులు, తాజా రాజకీయ పరిణామాలపై ఢిల్లీ పెద్దలతో స్టేట్ బీజేపీ లీడర్స్ ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు

మర్రి శశిధర్ రెడ్డి  నవంబరు 19న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేయలేని  స్థితికి చేరుకుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ కు లేదని అన్నారు. రేవంత్ రెడ్డికి  పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని తాను అధిష్టానానికి సూచించానని, తెలంగాణ పార్టీ పరిస్థితులపై మూడేళ్ల క్రితమే  అధిష్టానానికి చెప్పానని, అయినా  అధిష్టానం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ‘‘రేవంత్  వ్యవహార శైలి సరిగ్గా లేదు. ఆయన తీరు వల్లే ఈరోజు చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. రేవంత్ వైఖరి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన అందుబాటులో ఉండడు. తన వర్గం వారితో, చెంచాగాళ్లతో పార్టీని నడిపిస్తున్నాడు. డబ్బు ఖర్చు పెట్టకపోతే టికెట్లు, పదవులు ఇవ్వనని బెదిరిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో 15  మందిని గెలిపించుకొని తన సొంత దుకాణం నడిపించుకోవాలని భావిస్తున్నాడు. రేవంత్ తనకంటూ ప్రత్యేక కోటరీని ఏర్పాటు చేసుకుని పార్టీని నడిపిస్తున్నాడు. పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు”  అని మర్రి పేర్కొన్నారు.