ఆసిఫాబాద్ జిల్లాలో ప్రమాణ స్వీకారానికి రాని సర్పంచ్, వార్డ్ మెంబర్లు

ఆసిఫాబాద్ జిల్లాలో  ప్రమాణ స్వీకారానికి రాని సర్పంచ్, వార్డ్ మెంబర్లు
  •  ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ఘటన

ఆసిఫాబాద్, వెలుగు: సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థి, కొందరు వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ ప్రమాణ స్వీకారానికి సర్పంచ్ తో పాటు ఏడుగురు వార్డు సభ్యులు హాజరు కాకపోవడం స్థానికంగా హాట్​టాపిక్​గా మారింది. సోమవారం గ్రామ పంచాయతీ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో ఉప సర్పంచ్ తో పాటు ఆరుగురు వార్డు సభ్యులు మాత్రమే హాజరు కావడంతో అధికారులు వారితో ప్రమాణస్వీకారం చేయించారు. సగం కోరం ఉండడంతో వారితో ప్రమాణస్వీకారం చేపించినట్లు అధికారులు పేర్కొన్నారు. 

సభ్యుల మధ్య విభేదాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు  తెలుస్తోంది. ఐదేండ్లపాటు కలసి పనిచేయాల్సిన పాలకవర్గం వర్గాలుగా విడిపోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతగా నడుచుకోవాల్సిన సర్పంచ్, వార్డు సభ్యులు ఇలా వ్యవహరించడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.