కేసీఆర్‌ సీఎం అయ్యాకే ఏపీ నీళ్ల దోపిడీ పెరిగింది

కేసీఆర్‌ సీఎం అయ్యాకే ఏపీ నీళ్ల దోపిడీ పెరిగింది

మహబూబ్‌నగర్‌ను సస్యశ్యామలం చేస్తామంటిరి.. ఏమైంది?: నాగం
కృష్ణా నీళ్లను మన భూములకివ్వలేని అసమర్థ సీఎం అవసరమా?
 ప్రాజెక్టుల రీ డిజైనింగే కొంపముంచింది.. అన్నీ కొత్త ప్రాజెక్టులైనయ్‌

హైదరాబాద్‌‌, వెలుగు: కేసీఆర్ సీఎం అయ్యాకే కృష్ణా నీళ్లను ఆంధ్రా ఎక్కువగా దోపిడీ చేస్తోందని కాంగ్రెస్‌‌ సీనియర్‌‌ నేత నాగం జనార్దన్‌‌ రెడ్డి ఆరోపించారు. మన ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా నీళ్లు ఇవ్వడం లేదన్నారు. కృష్ణా నీళ్లను మన భూములకు ఇవ్వలేని అసమర్థ సీఎం అవసరమా అని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌‌లో మీడియాతో నాగం మాట్లాడారు. ‘కేసీఆర్‌‌ అసమర్థతతో ప్రాజెక్టులన్నీ ఎండిపోతున్నాయి. పంపులు, కాల్వలున్నా ఉపయోగించుకోవడం లేదు. బేసిన్‌‌లు లేవు.. భేషజాలు లేవు అని కేసీఆర్‌‌ ఎట్లా అంటారు. కేసీఆర్‌‌కు ముందు చూపు లేకనే బేసిన్‌‌లోని ప్రజలకు అన్యాయం జరుగుతోంది. కేసీఆర్‌‌ అండతోనే ఏపీలో అక్రమ ప్రాజెక్టులు నిర్మి్స్తున్నారు’ అని ఆరోపించారు. అప్పర్‌‌ కృష్ణా, భీమా ప్రాజెక్టులు కట్టి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాను సశ్యశ్యామలం చేస్తామన్న కేసీఆర్‌‌ హామీ ఏమైందో చెప్పాలన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగే రాష్ట్రం కొంప ముంచిందని.. సోర్స్‌‌ పాయింట్‌‌లు, స్కోప్‌‌ మార్చడంతో మనవన్నీ కొత్త ప్రాజెక్టులు అయ్యాయని అన్నారు. కాంగ్రెస్‌‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కమిషన్‌‌ల కోసమే రీ డిజైన్‌‌ చేశారని, అదే మనకు ముప్పుగా మారిందన్నారు.
కాళేశ్వరం మోటార్లు ఎందుకు బందైనయ్‌‌?
తెలంగాణ వచ్చింది ప్రజల కోసమా.. కల్వకుంట్ల ఫ్యామిలీ కోసమా చెప్పాలని నాగం నిలదీశారు. తెలంగాణ మంత్రులు సీఎంకు బానిసలుగా ఉన్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి డిస్కవరీ చానల్‌‌లో డప్పు కొట్టుకున్నారని, పోచంపాడు ప్రాజెక్టు కింద పొలాలను చూపించి ప్రచారం చేసుకున్నారని నాగం మండిపడ్డారు. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌసుల్లో మోటార్లు ఎందుకు బంద్‌‌ అయ్యాయో చెప్పాలన్నారు. ఏపీ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, రాయలసీమ నీళ్ల దోపిడీ ఎక్కువైందని అన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించాలంటూ ప్రధాని మోడీకి లెటర్‌‌ రాశానని చెప్పారు. ప్రధాని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దీనిపై చొరవ తీసుకోవాలన్నారు.