ఇదేం వైఖరి? ... ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంలో కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్ 

ఇదేం వైఖరి? ... ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంలో కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్ 

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో మన దేశం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదని కాంగ్రెస్ మండిపడింది. మన దేశ వైఖరి తీవ్రంగా నిరాశపర్చిందని పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచీ అనుసరిస్తున్న తీరు భిన్నంగా ఉందని తెలిపింది. గాజా ఆస్పత్రిపై జరిగిన దాడి దిగ్ర్భాంతికి గురి చేసిందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేయగా, దానిపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్పందించారు.

 ‘‘పాలస్తీనా పోరాటానికి ఇండియా మద్దతు ఇచ్చేది. అయినప్పటికీ ఏవైనా దాడులు, ప్రతిదాడులు జరిగితే తీవ్రంగా ఖండించేది. కానీ దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఇండియా అనుసరిస్తున్న వైఖరి యుద్ధానికి ముగింపు పలికేలా లేదు” అని ఆయన గురువారం ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. ‘‘గాజా ఆస్పత్రిపై జరిగిన దాడిని ఖండించాల్సిందే. అలాగే హమాస్ అరాచకాలు కూడా సమర్థించలేనివి. కానీ ఈ పరిస్థితికి దారితీసిన చారిత్రక నేపథ్యాన్ని కూడా పరిశీలించాలి. గాజాను నాశనం చేయాలని ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలకు కొన్ని దేశాలు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాంటి పని మన దేశం చేయొద్దు” అని కేంద్రాన్ని కోరారు. శాంతి నెలకొల్పేందుకు ఇండియా ప్రయత్నాలు చేయాలని, మన దేశం నుంచి ప్రపంచం ఆశిస్తున్నది అదేనని పేర్కొన్నారు.