
దళిత సీఎం అర్హత.. ఇప్పటికీ ఎవరికి లేదా?
ఇంకెప్పుడు వస్తుందని కేసీఆర్ను ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ
ఇండియా టుడే ఇంటర్వ్యూలో సీఎం కామెంట్లపై ఫైర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సీఎం చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ మండిపడింది. సీఎం అయ్యే అర్హత దళితుల్లో ఇప్పటికీ ఎవరికి లేదని భావిస్తున్నారా? అని కేసీఆర్ ను ప్రశ్నించింది. ఇండియా టుడే ఇంటర్వ్యూలో కేసీఆర్ చెప్పిన ఆన్సర్లపై కాంగ్రెస్ ఫైర్అయింది. ఈ మేరకు శనివారం ఓ ట్వీట్లో కేసీఆర్కు పలు ప్రశ్నలను సంధించింది. ‘‘2014 ఎన్నికల తర్వాత కొత్త రాష్ట్రంలో దళితుడిని సీఎం చేస్తే పాలన సరిగా సాగదు కాబట్టి తానే సీఎం అయ్యానని కేసీఆర్అన్నారు.
టైం వచ్చినప్పుడు చేస్తా అంటున్నారు. సరే, తొలి టర్మ్ అయిపోయింది.. మరి, 2018లో ఆ సమయం రాలేదా? 2014 నుంచి 2018 వరకు మీ పాలన బాగా లేదని అంగీకరిస్తున్నారా? అందుకే 2018లో దళితుడిని సీఎం చెయ్యలేదా?. 2018 నుంచి 2023 వరకు మీ పరిపాలనపై మీకు నమ్మకం లేదా? ఈ తొమ్మిదేండ్లలో మీ పాలన బాగాలేదు కాబట్టే.. మళ్లీ మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారా?” అని ప్రశ్నించింది.
‘‘దళితుడికి పాలనా పగ్గాలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? మీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లోని దళితులకూ ఆ అర్హత లేదనుకుంటున్నారా? మీ పాలనలో దళిత నాయకుడు పాలకుడిగా ఎదగలేరని భావిస్తున్నారా? మరి, బీఆర్ఎస్ తరఫున దళితుడిని సీఎం చేసే అవకాశం ఇంకెప్పుడు వస్తుంది? సీఎం మాట అటుంచితే.. ఉప ముఖ్యమంత్రి పదవినీ తీసేసి ఇన్నేండ్లు ఎందుకు పాలించారు?”అని నిలదీసింది.
దళితుడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటేనే కేసీఆర్ సహించలేదని, దళితుడు పక్కన కూర్చుంటే ఓర్చుకోలేని అహంకారపూరిత వ్యక్తి కేసీఆర్ అని మండిపడింది. అలాంటి వ్యక్తి దళితుడిని సీఎం చేస్తానంటే ఎలా నమ్ముతాం అని పేర్కొంటూ ట్వీట్ చేసింది.