ఉపాధి చట్టం కోసం ఉద్యమించాలి : మీనాక్షి నటరాజన్

ఉపాధి చట్టం కోసం ఉద్యమించాలి : మీనాక్షి నటరాజన్
  • పంజాబ్ రైతుల తరహాలో కూలీలు పోరాడాలి: మీనాక్షి నటరాజన్
  •     పేదల పొట్టగొట్టే చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్

అచ్చంపేట, వెలుగు: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు పోరాడిన తరహాలోనే ఉపాధిహామీ చట్టాన్ని కాపాడుకునేందుకు గ్రామీణ పేదలు ఉద్యమించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్​ పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత కూలీలకు అండగా ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నాగర్​కర్నూలు జిల్లా అచ్చంపేట, బల్మూర్ మండలాల్లో సోమవారం ఆమె పర్యటించారు. అచ్చంపేట మండలంలోని బుడ్డ తాండలో లంబాడా కూలీలతో, బల్మూర్ మండలం చెంచుగూడెంలో  చెంచు కూలీలతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

రాముడి పేరు చెప్పి పేదల ఉపాధిని దెబ్బతీయడం సిగ్గుచేటన్నారు. కరోనా, నోట్ల రద్దు లాంటి విపత్కర సమయాల్లో గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం అండగా నిలిచిందని గుర్తుచేశారు. మోదీ ప్రధాని అయినప్పటి నుంచే ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్రం తెచ్చిన జీ రామ్​జీ పథకం కింద వంద రోజుల పని కూడా కల్పించే పరిస్థితి లేదని, గతంలో 150 రోజులు పని దినాలుండేవని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి చెంచు కుటుంబంలో  నలుగురికి 150 రోజుల చొప్పున పని కల్పించేవాళ్లమని, 15 రోజుల కూలీ అడ్వాన్స్​గా చెల్లించే వారన్నారు.

మహాత్మా గాంధీ పేరున ఉన్న స్కీమ్​నే  కొనసాగించాలని డిమాండ్ చేశారు. బుడ్డతాండలో లంబాడా సంప్రదాయ దుస్తులు ధరించి  మహిళలతో కలిసి మీనాక్ష్మి డాన్స్​ చేశారు. ఉపాధి కూలీల సమస్యలను వీడియో కాల్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వినిపించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఎన్ఆర్ఈజీఎస్ బచావో.. వీబీ జీ రామ్ జీ హఠావో అంటూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, రాష్ట్ర ఆదివాసీ విభాగం చైర్మన్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు.