దేశంలో పేదరికం ఒక్కటే కులమైతే..మోదీ ఓబీసీ ఎట్లైతరు? : రాహుల్​ గాంధీ

దేశంలో పేదరికం ఒక్కటే కులమైతే..మోదీ ఓబీసీ ఎట్లైతరు? : రాహుల్​ గాంధీ
  • ఆదివాసీలను వనవాసీ అనడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ

జగదల్​పూర్(చత్తీస్​గఢ్): దేశంలో పేదరికం ఒక్కటే కులం అని చెప్పిన ప్రధాని మోదీ.. తాను ఓబీసీని అని ఎందుకు చెప్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. శనివారం ఆయన చత్తీస్​గఢ్ లోని జగదల్​పూర్​ ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. బీజేపీ వనవాసీ అనే పదం వాడి గిరిజనులను అవమానిస్తోందని విమర్శించారు.‘‘బీజేపీ నేతలు తమ ప్రసంగంలో ఆదివాసీకి బదులు వనవాసీ అనే పదం వాడుతున్నారు. 

బీజీపీ, ఆర్ఎస్ఎస్ ఈ కొత్తపదాన్ని తీసుకువచ్చాయి. వనవాసీ, ఆదివాసీ మధ్య చాలా తేడా ఉంది. మధ్యప్రదేశ్​లో బీజేపీ నేతలు గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసి, దాన్ని వీడియో తీశారు. తర్వాత అది వైరల్ అయింది.ఆ పార్టీ ఆలోచనా ధోరణి అలా ఉంటుంది. ఆదివాసీ అనేది ఒక విప్లవాత్మక పదం. ఆదివాసీ.. ఈ దేశానికి అసలైన యజమాని. గిరిజనులను అవమానించేలా ఉన్న వనవాసీ పదాన్ని కాంగ్రెస్ అంగీకరించదు’’ అని రాహుల్ గాంధీ చెప్పారు. 

దేశంలో దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాలున్నాయని, పేదరికం ఒక్కటే కులం అని మోదీ అంటే.. ఆయన తనను తాను ఓబీసీ అని ఎందుకు చెప్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల భూములు, గనులను అదానీకి కట్టబెడుతోందని మండిపడ్డారు. 

రుణమాఫీ చేస్తం..

చత్తీస్‌‌గఢ్‌‌లో రైతులకు రుణమాఫీ చేస్తామని, ఎకరాకు 20 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేస్తామని, రాష్ట్రంలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే వ్యవసాయ కూలీలకు ఏటా రూ.10,000 వరకు ఆర్థిక సాయం అందజేస్తామని రాహుల్​గాంధీ హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన చత్తీస్‌‌గఢ్‌‌లోని కతియా గ్రామంలో వరి రైతులు, వ్యవసాయ కూలీలతో మాట్లాడిన వీడియో ‘ఎక్స్’ లో పోస్ట్​ చేశారు.