మూడు నెలల్లో 25శాతం నిత్యావసర ధరలు పెరిగాయ్: జైరాం రమేశ్

మూడు నెలల్లో 25శాతం నిత్యావసర ధరలు పెరిగాయ్: జైరాం రమేశ్
  • ‘ప్రవచన మంత్రి’కి.. ప్రజల కష్టాలు పట్టట్లేదు
  • మూడు నెలల్లోనే 25% పెరిగిన నిత్యావసర ధరలు: జైరాం రమేశ్​  
  • సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మోదీ సర్కార్​పై ఫైర్​ 

న్యూఢిల్లీ: నిత్యావసర ధరల నియంత్రణలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తీవ్రంగా విమర్శించారు. ‘ప్రవచన మంత్రి’కి ప్రజల కష్టాలు పట్టడంలేదని ప్రధానిని ఉద్దేశించి 'ఎక్స్' వేదికగా ఫైర్ అయ్యారు. గత మూడు నెలల్లో వంటింటి ఖర్చులు 25% పెరగడంతో సామాన్యులకు భారంగా మారిందన్నారు. సామాన్యులు తమ ఇంటి బడ్జెట్‌‌ను ఎలా నెట్టుకొస్తున్నారో మోదీజీకి తెలుసా? అని ప్రశ్నించారు.

 కందిపప్పు ధర కిలో రూ.150, పెసరపప్పు రూ.120, బియ్యం కిలో ధర రూ.55 అయ్యిందని, ఆవనూనె లీటరు ధర రూ.190కి చేరిందన్నారు. ఆగస్టులో ఆహార ద్రవ్యోల్బణం 5.95 శాతంగా ఉందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయన్నారు. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ధరలు భారీగా పెరగడంతో ఇల్లు గడవక పేద ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. పండుగ సీజన్​లో ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 

పెరుగుతున్న ధరల సమస్యను కేంద్ర సర్కార్​ ఎప్పుడు నియంత్రిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. యాంటీ పీపుల్ పాలసీని అనుసరిస్తున్న బీజీపీ ప్రభుత్వం జీడీపీ ఫిగర్స్‌‌ను ప్రస్తావిస్తూ గొప్పలు చెప్పుకుంటోందని జైరాం రమేశ్ ఆరోపించారు.