- ఇన్చార్జులుగా మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్
- బీఆర్‍ఎస్ హయాంలో 9 స్థానాల్లో గులాబీ పార్టీ క్లీన్‍స్వీప్
- ఈసారి మరో 3 కొత్త మున్సిపాలిటీలతో 12 స్థానాల్లో ఎలక్షన్స్
- ఉమ్మడి జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ వాళ్లే..
- పాత చైర్మన్ స్థానాలు కాపాడుకోవడంపై బీఆర్‍ఎస్ నేతల్లో టెన్షన్
వరంగల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎలక్షన్లకు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఓరుగల్లు మున్సిపాలిటీ పీఠాలపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టిపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలు మొదలు గడిచిన రెండేండ్లుగా రాష్ట్రంలో ఏ ఎలక్షన్లు వచ్చినా మెజార్టీ స్థానాలు తమ ఖాతాలో వేసుకుంటున్న హస్తం పార్టీ ఈసారి మున్సిపాలిటీ చైర్‍పర్సన్ల విజయాలపై ఫోకస్ పెట్టింది.
బీఆర్‍ఎస్ హయాంలో ఉమ్మడి వరంగల్లోని అన్ని స్థానాలను ఆ పార్టీనే దక్కించుకోగా, ఈసారి అవే తరహా ఫలితాలతో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓరుగల్లు జిల్లాలపై పట్టున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, పొన్నం ప్రభాకర్‍ను ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా నియమించింది.
బీఆర్‍ఎస్ మెజార్టీ ఎమ్మెల్యేలతో గెలుపు..
రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‍ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో హవా చూపింది. ములుగు నియోజకవర్గంలో సీతక్క మినహా ఇద్దరు మంత్రులతో సహా 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్సీలతో గులాబీ పార్టీ బలంగా ఉండటంతో అన్నిచోట్ల తమ సత్తా చాటింది. నాడు ఓరుగల్లులో 9 మున్సిపాలిటీలు ఉండగా, అన్నింటిని బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుని క్లీన్ స్వీప్ చేసింది.
ఓరుగల్లులో ప్రస్తుతం కాంగ్రెస్ హవా..
ఓరుగల్లు రాజకీయాల్లో గత రాజకీయాల్లో సీన్ రివర్స్ అయింది. నాడు బీఆర్‍ఎస్ బలమున్న ప్రతిచోట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. నాడు బీఆర్‍ఎస్ మంత్రులుగా ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతిరాథోడ్ ఉంటే ఇప్పుడు హస్తం నుంచి ధనసరి సీతక్క, కొండా సురేఖ కేబినెట్లో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి మినహా మిగతా 11 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీ వైపు ఉన్నారు. వరంగల్, మహబూబాబాద్ ఎంపీలుగా కడియం కావ్య, బలరాం నాయక్ ఉన్నారు. దీంతో మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో హస్తం పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు.
ఢీలా పడిన బీఆర్ఎస్..
నాడు ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీల్లో క్లీన్‍స్వీప్ చేసిన బీఆర్‍ఎస్ ఇప్పుడు ఢీలా పడింది. అసెంబ్లీ, ఎంపీ ఎలక్షన్లలో నెగటివ్ ఫలితాలతో ఎన్నికలంటే వెనక్కుపోతున్నారు. నాడు గులాబీ సైన్యంగా ఉన్న పలువురు లీడర్లు ఇప్పుడు హస్తం పార్టీలో చేరారు. 2 ఎంపీ స్థానాలు, 11 నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ఒక్క ఎమ్మెల్యే లేరు. ఒకరిద్దరూ మాజీ ఎమ్మెల్యేలు తప్పితే ఓటమి చెందిన బీఆర్‍ఎస్ ఎమ్మెల్యేలు జనాలకు దూరంగా ఉన్నారు. ఇదేటైంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవడంతో 9 మున్సిపాలిటీ పీఠాలను తిరిగి కాపాడుకోడానికి బీఆర్ఎస్ నేతలు కష్టపడాల్సి ఉంటుంది. కనీస పోటీ ఇచ్చే అభ్యర్థుల ఎంపిక కోసం ఆలోచన చేస్తున్నారు.
పొంగులేటి, పొన్నంతో ముందస్తు ఫోకస్..
ఓరుగల్లులో గతంలో 9 మున్సిపాలిటీలు ఉండగా, ఈసారి ములుగు, స్టేషన్ ఘన్‍పూర్, కేసముద్రం కొత్తగా మున్సిపాలిటీలుగా మారాయి. దీంతో అధికార కాంగ్రెస్ గతంలో బీఆర్‍ఎస్ చేతిలో ఉన్న చైర్‍పర్సన్ స్థానాలతో పాటు పెరిగిన మూడు స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులనే గెలిపించేలా వ్యూహరచన చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర వేసుకున్న పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డిని వరంగల్ పార్లమెంట్‍కు, బీసీ సీనియర్ మంత్రిగా పొన్నం ప్రభాకర్‍ను మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీ స్థానాలకు పార్టీ తరఫున ఇన్చార్జీగా నియమించారు. దీంతో నేడోరేపో ఇరువురు రంగంలోకి దిగనున్నారు. అదే జరిగితే గత ఫలితాలు తారుమారయ్యే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
