నా దేశం ఏడవాల్సిందే: చిదంబరం

నా దేశం ఏడవాల్సిందే: చిదంబరం

మోడీ ప్రసంగంపై కాంగ్రెస్‌ నేతల విమర్శలు

పేదలు, ఆర్థిక వ్యవస్థపై ప్రకటన చేయలేదన్న నేతలు

ప్రజలను వారిని వారే సంరక్షించుకోవాలని వదిలేశారని కామెంట్

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ పొడిగించడాన్ని సపోర్ట్‌ చేస్తూనే ప్రభుత్వంపై విమర్శలు చేశారు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం. ప్రధాని మోడీ మంగళవారం జాతినుద్దేశించి మాట్లాడిన విషయాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. “ 21+19 రోజులు పేదలు వారిని వారే రక్షించుకోవాల్సిన స్థితిలో వదిలేశారు. నిధులు, ఆహార ధాన్యాలు పుష్కలంగా ఉన్నా కేంద్రం వాటిని వెంటనే రిలీజ్‌ చేయదు. ఇక నా దేశం ఏడవాల్సిందే. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారని మాకు అర్థం అవుతుంది. లాక్‌డౌన్‌ పొడిగించే నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. కానీ సీఎంలు అడిగిన నిధుల గురించి పట్టించుకోలేదు. మార్చి 25న ప్రకటించిన ప్యాకేజీకి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు. రాఘురామ్‌ రాజన్‌ నుంచి జియాన్‌ డెర్జీ, ప్రభాత్‌ పట్నాయక్‌ నుంచి అభిజిత్‌ బెనర్జీ వరకు ఏ ఒక్కరి సూచనలు పాటించలేదు” అని చిదంబరం ట్వీట్‌ చేశారు. చిదంబరంతో పాటు మరి కొంత మంది కాంగ్రెస్‌ నేతలు కూడా ప్రధానిపై విమర్శలు చశారు. మోడీ వాక్చాతుర్యం ప్రదర్శించి ప్రజలను వారిని వారే సంరక్షించుకోవాలని చెప్పకనే చెప్పారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, పేదలకు ఆర్థిక ప్యాకేజీ కూడా ప్రకటించలేదని, ఎకానమీని బలోపేతం చేసేందుకు తీసుకునే చర్యల గురించి చెప్పలేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సర్జేవాలా కామెంట్‌ చేశారు. కరోనాను ఎలా ఎదుర్కొంటున్నారనే విషయంపై రోడ్‌మ్యాప్‌ ఏదని ప్రశ్నించారు. “ లీడర్‌‌ అంటే జనాల బాధ్యత ఏంటని గుర్తు చేసేవాడు కాదు. జనాల కోసం ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పేవాడు. కరోనాను ఎలా ఎదుర్కొంటారో చెప్పకుండా. వేరే వేరే విషయాలేవో చెప్పారు ” అని సుర్జేవాలా కామెంట్‌ చేశారు. దీనిపై మరో కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ కూడా తీవ్ర విమర్శలు చేశారు. లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయం సరైందే అయినా.. పేదల కోసం ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధ కలిగించదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ పారిశ్రామిక రంగాన్ని ఎలాంటి ప్యాకేజ్‌ ఇవ్వలేదని అన్నారు. మోడీపై ఎంపీ శశిథరూర్‌‌ కూడా తీవ్ర కామెంట్స్‌ చేశారు. జన్‌ధన్‌ అకౌంట్లు, జీఎస్టీ బకాయిలు, ఎమ్‌ఎన్‌ఆర్‌‌ఈజీఏ పేమెంట్స్‌ తదితర అంశాలపై క్లారిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.