
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌ను ఈడీ విచారణ పేరుతో కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడాన్ని నిరసిస్తూ రాజ్‌భవన్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ తెలిపారు. రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో బుధవారం కూడా గాంధీభవన్‌లో నిరసన దీక్ష సాగింది. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ పిలుపుతో గురువారం ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటలకు పీజేఆర్ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా రాజ్‌భవన్ వెళ్తామన్నారు. విచారణ పేరుతో తమ నేతలకు ఇబ్బంది పెట్టడమే కాకుండా పోలీసులు ఏఐసీసీ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కొట్టి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు.
కేసీఆర్ మోడీ చేతిలో కీలుబొమ్మ
జిల్లా కేంద్రాలు, కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శనలు ఉంటాయని, కార్యకర్తలు తరలి రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. సోనియాను ఇబ్బందులకు గురి చేయడం ఈ ప్రాంతవాసులకు అవమానకరమన్నారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ చేతిలో కీలుబొమ్మగా ఉన్నారన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ సుపారీ తీసుకున్నారని ఆరోపించారు.