యూపీ ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకే

యూపీ ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకే

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో మహిళలను పూర్తిస్థాయిలో భాగస్వామ్యుల్ని చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా చెప్పారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగబోయే శాసనసభ ఎన్నికల్లో 40 శాతం సీట్లలో మహిళలనే పోటీ చేయిస్తామని ప్రకటించారు. మహిళలకు రూ.2000 డబ్బులు, ఎల్పీజీ సిలిండర్ ఇస్తే చాలని ఇతర పార్టీలు భావిస్తున్నాయని, దీనిని తాము మారుస్తామని ప్రియాంక చెప్పారు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎందరో మహిళల బాధలు, కష్టాలు ఉన్నాయన్నారు. ‘‘యూపీలోని ఉన్నావ్‌లో రేప్‌, హత్యకు గురైన మహిళ కోసం... హత్రాస్‌లో రేప్‌కు గురై నేటీకి న్యాయం దక్కని మహిళ కోసం.. లఖీంపూర్‌‌ ఖేరీలో నేను మాట్లాడిన బాలిక కోసం.. ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ బాలిక తాను ప్రధానమంత్రి కావాలని కలలు కంటోంది. అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న ప్రతి మహిళ కోసం ఈ నిర్ణయం” అని ప్రియాంక చెప్పారు. మహిళకు భద్రత కల్పిస్తామని మాటలు చెప్పే కొందరు నేతలు మహిళల్ని అణచివేస్తున్నవారిని కాపాడే పనిలో బిజీగా ఉంటున్నారని ఆమె ఆరోపించారు. బహిరంగంగా ప్రజలను వాహనాలతో తొక్కించడమే అధికారంగా భావిస్తున్నారని మండిపడ్డారు.

ద్వేషపూరిత వాతావరణాన్ని మహిళలు మాత్రమే మార్చగలరని, కరుణ, సేవాభవం, ధృఢత్వం మహిళల్లోనే ఉంటాయి కాబట్టి వారే పరిస్థితిని మార్చగలరని ప్రియాంకా గాంధీ అన్నారు. యూపీ మహిళలు రాజకీయాల్లోకి వచ్చి తన భుజం కలిపి నడవాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గానికి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా మహిళలకు పిలుపునిస్తున్నామని, నవంబర్ 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రియాంక చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న మహిళలు ముందుకు వస్తే అవకాశం కల్పిస్తామని, మహిళంతా కలిసి ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు దేశరాజకీయాలను మారుద్దామని పిలుపునిచ్చారు.