
- ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తం: రేవంత్‌రెడ్డి
- కాంగ్రెస్‌కి నష్టం కలిగేలా మాట్లాడితే ఊరుకోనని సహించబోనని హెచ్చరిక
- పీసీసీ చీఫ్‌గా రేవంత్ బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా సభ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూడలేక మోడీ, కేడీలు (కేసీఆర్) కుట్రలు పన్నుతున్నారని, కానీ వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘‘నా లక్కీ నంబర్ తొమ్మిది. రాష్ట్రంలో 90 సీట్లు వస్తాయి. ప్రజలు ఇంకా ఆశీర్వదిస్తే 99 సీట్లు కూడా వస్తాయి. వచ్చే ఏడాది జూన్, జులైలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’’ అని అన్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం గాంధీభవన్‌లో సభ నిర్వహించారు.
సీడబ్ల్యుసీ శాశ్వత ఆహ్వానితునిగా ఎన్నికైన టి.సుబ్బరామిరెడ్డికి సన్మానం చేశారు. వివిధ పార్టీల నేతల చేరిక కార్యక్రమం కూడా ఒకే వేదికపై జరిగాయి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ గురించిన చర్చ జరగకుండా మోడీ, కేడీలిద్దరూ కులం పేరు మీద, మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వీళ్లు ఎన్ని ఎత్తులు, జిత్తులు వేసినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఆర్టీఐ పేరుతో కేసీఆర్ అవినీతి బయటపెడుతామన్నట్లు బండి సంజయ్ మాట్లాడడం చూస్తుంటే నవ్వొస్తున్నదన్నారు. కేసీఆర్ మీద కేంద్ర విచారణ సంస్థలు ఇప్పటికే కేసులు పెట్టాయని, బీజేపీ సర్కార్ తలుచుకుంటే వెంటనే జైల్లో పెట్టవచ్చన్నారు.
హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కేసీఆర్ పైసలతోనే జరిగాయని, వాళ్ల ఫుడ్డు, బెడ్డు ఖర్చులన్నీ టీఆర్ఎస్ భరించిందన్నారు. ‘‘పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ సభ జరిపినమని సంకలు కొట్టుకుంటున్నది. టీఆర్ఎస్ అంతకన్నా ఎక్కువ మందితో సభ నిర్వహించాలి. ఆ సభ తర్వాత మేం ఈ 2 పార్టీల కన్నా ఎక్కువ మందితో అదే వేదికపై సభ జరుపుతాం” అని రేవంత్ అన్నారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలే: భట్టి
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను టీఆర్ఎస్ నెరవేర్చలేదని మండిపడ్డారు. మోసపూరిత హామీలు ఇచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణ కోసం చేసిందేమీ లేదన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ రాబందుల సమితిగా మారి ప్రజలను దోచుకు తింటున్నదని ఆరోపించారు. దీనిపై జనంలో తిరుగుబాటు మొదలైందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 70 స్థానాలకు తగ్గకుండా సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఆగస్టులో రాహుల్ గాంధీతో గిరిజన సభ ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యలపై సాగించే పోరాటాలకు అండగా రెండు నెలలకోసారి రాహుల్, ప్రియాంక రాష్ట్రానికి వస్తారని చెప్పారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది నాయకులు ప్రాణ త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ అని, నేతలందరూ కలిసి పని చేస్తే అధికారం సాధ్యమేనని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ చేరిక
మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చెన్నూరు, బడంగ్‌పేట మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉదయం రేవంత్ ఇంటి వద్ద ఖైరతాబాద్‌కు చెందిన నేతలు పార్టీలో చేరారు.
గాంధీభవన్‌లో బోనాల ఉత్సవాలు
మహిళా కాంగ్రెస్ చీఫ్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో గాంధీభవన్ ఆవరణలో గురువారం బోనాల ఉత్సవాలు నిర్వహించారు. బోనం ఎత్తుకున్న మహిళా నేతలు, కార్యకర్తలు లోయర్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న కట్టమైసమ్మ గుడి వరకు ఊరేగింపుగా వెళ్లి బోనం సమర్పించారు.
హనుమంతుడిలా పనిచేస్త
దేశ భవిష్యత్తు కోసం త్యాగాలు చేసిన చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ అని, అలాంటి పార్టీకి తనను నమ్మి అధ్యక్షునిగా చేసినందుకు రాహుల్ గాంధీకి హనుమంతుడిలా పని చేస్తానని రేవంత్ అన్నారు. ప్రధాని, సీఎంల కంటే ఇది అత్యంత ముఖ్యమైనదన్నారు. పీసీసీ అధ్యక్షునిగా తాను రాష్ట్రంలో పార్టీ కుటుంబ పెద్దనని, పార్టీలో తనకన్నా సీనియర్లు ఉన్నా అందరి బాధలు, అవమానాలు తనవేనన్నారు.
అందుకే సోషల్ మీడియా వేదికగా, ఇతరత్రా ఎవరైనా పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడితే సహించబోనన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. 365 రోజుల తర్వాత అధికారంలోకి వచ్చే కాంగ్రెస్‌కి సీఎంగా ఎవరుండాలో సోనియా గాంధీ సూచిస్తే వారిని కుర్చీలో కూర్చోబెడతానన్నారు. అప్పటిదాకా ఎవరూ వేరే ఆలోచనలు చేయవద్దన్నారు. పీసీసీ చీఫ్‌గా ఏడాది పూర్తి చేసుకున్న రేవంత్‌కు పలువురు నేతలు అభినందించారు.