
హైదరాబాద్, వెలుగు: కేంద్రం జనాభా లెక్కలతోపాటు కులగణన నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ విజయంగా అభివర్ణిస్తూ గురువారం గాంధీభవన్‌లో ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకున్నారు. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పటాకులు కాల్చారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. రాహుల్, రేవంత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
అంతకుముందు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో హైదరాబాద్‌కు చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. రాహుల్, రేవంత్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిన కులగణన ఇప్పుడు దేశవ్యాప్తంగా చేయాలని కేంద్రం నిర్ణయించడం కాంగ్రెస్ ఘనతేనని అన్నారు.
మేడే ఉత్సవాలు
మేడే సందర్భంగా గాంధీభవన్‌లో సేవాదళ్, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మేడే ప్రత్యేకతను వివరించారు. జాతీయ స్థాయిలో కార్మికుల హక్కుల రక్షణకు, వారి సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట వేసిందని పలువురు నేతలు కొనియాడారు.