స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు..! విటులపై అక్రమ మానవ రవాణా కేసు చెల్లదు: హైకోర్టు కీలక తీర్పు

స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు..! విటులపై అక్రమ మానవ రవాణా కేసు చెల్లదు: హైకోర్టు కీలక తీర్పు
  • మహిళను లైంగిక దోపిడీకి వినియోగిస్తే మాత్రం కేసు పెట్టొచ్చు
  • ట్రాఫికింగ్ కు పాల్పడిన మహిళతో వ్యభిచారం చేయిస్తే బాధితురాలిగా గుర్తించాలి

స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే, మానవ అక్రమ రవాణాకు గురైన వ్యక్తిని లైంగిక దోపిడీ కోసం వినియోగించే ప్రయత్నం చేసినా.. ఆమె బాధితురాలని నమ్మే పరిస్థితులు ఉన్నా కేసు నమోదు చేయవచ్చని తేల్చింది.

హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే, మానవ అక్రమ రవాణాకు గురైన వ్యక్తిని లైంగిక దోపిడీ కోసం వినియోగించే ప్రయత్నం చేసినా.. ఆమె బాధితురాలని నమ్మే పరిస్థితులు ఉన్నా కేసు నమోదు చేయవచ్చని తేల్చింది. మరొకరికి అప్పగించడం, ముందస్తు ఒప్పందం, బ్రోకర్లు, మధ్యవర్తులతో, వ్యభిచార గృహాల నిర్వాహకులతో సంబంధాలు వంటి పరిస్థితులు ఉంటే మహిళను అక్రమ రవాణా బాధితురాలిగా గుర్తించి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయవచ్చని స్పష్టత ఇచ్చింది. 

స్వచ్ఛందంగా వ్యభిచారం చేస్తున్న మహిళ వద్ద పట్టుబడిన విటుల (కస్టమర్లు)పై మానవ అక్రమ రవాణా కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని చెప్పింది. సెక్స్‌‌ వర్కర్‌‌ నుంచి సేవలు పొందిన వ్యక్తిపై మావన అక్రమ రవాణా (ట్రాఫికింగ్‌‌) సెక్షన్‌‌ 370(2) (ఎ) కింద కేసులు నమోదు చేయడం చెల్లదని పేర్కొంది. వ్యభిచార గృహంలో లేదా పరిసరాల్లో ఉన్నారన్న కారణం ఈ సెక్షన్‌‌ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదంది. స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదన్న విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు తీరు చెప్పిన విషయాన్ని హైకోర్టు వెలువరించిన తీర్పులో పేర్కొంది. 

వ్యభిచార గృహాల్లో పట్టుబడిన విద్యార్థులు, యువకులు, వ్యాపారవేత్తలు, ప్రైవేటు ఉద్యోగులు తాము వినియోగదారులమని.. తమపై వేర్వేరు పోలీస్‌‌ స్టేషన్లల్లో నమోదైన కేసులను కొట్టివేయాలంటూ సుమారు 130కిపైగా పిటిషన్లు దాఖలయ్యాయి. విటులపై మానవ అక్రమ రవాణా కింద కేసులు నమోదు చేయడానికి సంబంధించిన వ్యవహారంపై ఏకసభ్య ధర్మాసనాలు వేర్వేరు తీర్పులు వెలువరించాయి. దీంతో ఈ వ్యవహారం ద్విసభ్య ధర్మాసనం తేల్చాలని చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆదేశించారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్‌‌ కె లక్ష్మణ్, జస్టిస్‌‌ బి.ఆర్‌‌ మధుసూదన్‌‌ రావుతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ సమగ్రంగా విచారించి ఇటీవల పైవిధంగా కీలక తీర్పు వెలువరించింది. 

విటులను అక్రమ రవాణాదారుగా పరిగణించలేం

సెక్స్‌‌ వర్కర్‌‌ సేవలను తన కోసం వినియోగించుకునే వ్యక్తిని అక్రమ రవాణాదారుగా పరిగణించలేమని హైకోర్టు తీర్పు చెప్పింది. ఐపీసీ సెక్షన్‌‌ 370, 370ఎ(2) ప్రస్తుతం బీఎన్‌‌ఎస్‌‌ ప్రకారం సెక్షన్‌‌ 143, 144 ట్రాఫికింగ్​కు పాల్పడిన వ్యక్తులను శిక్షించడానికి తీసుకువచ్చినవని వివరించింది. ఈ విషయాన్ని జస్టిస్‌‌ జేఎస్‌‌ వర్మ కమిటీ సిఫార్సు చేసిందని ఉదహరించింది. సెక్స్‌‌ వర్కర్‌‌ సేవలను పొందిన వ్యక్తికి ఇవి వర్తించవని స్వచ్ఛందంగా వ్యభిచారం చేస్తున్న మహిళలు, వారి కస్టమర్లను దర్యాప్తు సంస్థలు వేధింపులకు గురిచేయకూడదని చెప్పింది. 

సామాజిక పరిస్థితుల దృష్ట్యా మహిళ స్వచ్ఛందంగా ఈ వృత్తిలోకి వచ్చారా? బలవంతంగా వచ్చారా? లేక ప్రలోభాలకు గురైన వచ్చారా? ఇదీ కాకపోతే అక్రమ రవాణా కారణంగా వచ్చారా? అన్నది ఆయా కేసుల నమోదుకు కీలకం అవుతాయని స్పష్టం చేసింది. ఆయా పరిస్థితులను తేల్చి వాస్తవ పరిస్థితుల ఆధారంగా కేసు నమోదు చేయాల్సిన అంశమని వెల్లడించింది. స్వచ్ఛంద వ్యభిచారం చట్టవిరుద్ధం కాదంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ఉదహరిస్తూ.. వేశ్యాగృహం వద్ద పరిసరాల్లో కనిపించారన్న కారణంగా విటులపై కేసు నమోదుకు చేయకూడదని తేల్చి చెప్పింది.

ఆధారాలు లేకుండా అనుమానం ఉంటే సరిపోదు

మానవ అక్రమ రవాణాకు గురైన మహిళ అని తెలిసీ, అది నిజమనడానికి విశ్వసనీయ, ఆధారాలతో కూడిన కారణాలున్నా.. ఆమె సేవలను లైంగిక దోపిడీకి వినియోగిస్తే సెక్షన్‌‌ 370(ఎ) (2) వర్తిస్తుందని తీర్పులో పేర్కొంది. అందుకు బాధ్యులైన వ్యక్తులపై కేసు నమోదు చేయవచ్చని తేల్చింది. తగిన ఆధారాలు లేకుండా కేవలం అనుమానం ఉంటే సరిపోదని స్పష్టం చేసింది. విశ్వసించేలా తగిన ఆధారాలు ఉండాలంది. 

ట్రాఫికింగ్​కు గురైన మహిళను వినియోగించేందుకు ముందస్తు ఒప్పందం, మధ్యవర్తుల ప్రమేయం, బ్రోకర్లు, నిర్వాహకులతో ఒప్పందాలు, సంబంధాలు లాంటి పరిస్థితులు ఉంటే మహిళ ట్రాఫికింగ్ కు గురైన వ్యక్తిగా నిర్ధారించి కేసు నమోదు చేయవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో సెక్షన్‌‌ 370 కింద విటుడిపై కేసు నమోదు చేయరాదని తీర్పు వెలువరించింది. అక్రమ రవాణాకు గురైన సెక్స్‌‌ వర్కర్‌‌ సేవలను వినియోగించుకుంటే కేసు నమోదు చేయవచ్చంటూ 29 పేజీల తీర్పులో పేర్కొంది.