బీఆర్‌‌ఎస్‌లో నాపై కుట్రలు జరిగాయి : అలంపూర్  ఎమ్మెల్యే అబ్రహం

బీఆర్‌‌ఎస్‌లో నాపై కుట్రలు జరిగాయి : అలంపూర్  ఎమ్మెల్యే అబ్రహం

గద్వాల, వెలుగు : బీఆర్ఎస్ లో తనపై కుట్రలు జరిగాయని, ఎస్సీ నియోజకవర్గంలో అగ్ర కులాల పెత్తనం ఏంటని అలంపూర్‌‌  ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. బీఫాం ఇవ్వకుండా తనను అవమానించినందుకు బాధతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. తనకు కాకుండా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి అనుచరుడు విజయుడుకి బీఫాం ఇవ్వడంపై బుధవారం ఆయన అలంపూర్  చౌరస్తాలో మీడియాతో మాట్లాడారు.

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎస్సీ నియోజకవర్గంలో అగ్రకులాల ఆధిపత్యంతో రాజకీయాలు భ్రష్టుపడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నేను సైలెంట్‌గానే ఉంటా. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు వారి భవిష్యత్‌  కార్యాచరణను వారే చూసుకోవాలి. నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్న. తెలంగాణ ఉద్యమంలో జెండా కూడా మోయని ఒక అనామకుడికి, జీవోలు కూడా చదవలేని వ్యక్తికి బీఫాం ఇవ్వడమే నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి కూడా ఏనాడు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి కాదు.

అగ్ర కులాల ఆధిపత్యంతో నాకు బీఫాం ఇవ్వకుండా ఆయన అడ్డుపడ్డారు”అని అబ్రహం పేర్కొన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అలంపూర్  ప్రజలకు ఎన్నో సేవలు చేశానని చెప్పారు. గతంలో కూడా తనకు బీఫాం రాకుండా చల్లా అడ్డుపడ్డారని, అప్పుడు బాధపడలేదని, కానీ ఇప్పుడు చల్లా చేసిన పని ఎంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. కార్యకర్తలు, అనుచరులు పార్టీ మారాలని సలహాలు ఇచ్చినా.. వాటిని తాను తిరస్కరించానని పేర్కొన్నారు. అలంపూర్ ప్రజలు తమ తీర్పును ఓ మంచి వ్యక్తికి ఇవ్వాలని ఈ సందర్భంగా అబ్రహం కోరారు. ఇప్పటివరకు తనకు సహకరించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.