దేశంలో మరో భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

దేశంలో మరో భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

జైపూర్: దేశంలో మరో భారీ రైలు ప్రమాదానికి దుండగులు కుట్ర పన్నారు. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‏లోని కాన్పూర్‎లో రైల్వే ట్రాక్‎పై గ్యాస్ సిలిండర్లు పెట్టి ట్రైన్ యాక్సిడెంట్‎కు ప్లాన్ చేయగా.. తృటిలో పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఓ పక్కా ఈ ఘటనపై విచారణ జరగుతుండగానే.. దేశంలో మరో భారీ విధ్వంసానికి దుండగులు తెరలేపారు. తాజాగా, రాజస్థాన్‌‎లోని అజ్మీర్‌లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. గుర్తు తెలియని దుండగులు రైల్వే ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను పెట్టారు. దాదాపు 70 కిలోల బరువున్న ఈ సిమెంట్ దిమ్మెను ట్రాక్‏పై అమర్చగా.. వేగంగా దూసుకొచ్చిన ట్రైన్ ఈ దిమ్మెను ఢీకొట్టింది.

 రైలు వేగానికి దిమ్మె ట్రాక్ పై నుండి పక్కకు పడిపోగా.. ఈ ఘటనలో రైలు ఇంజిన్‌తో ట్రాక్‌ కొంత భాగం దెబ్బతిన్నది. ఈ విషయాన్ని లోకో పైలట్ రైల్వే అధికారులతో పాటు ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. ప్రమాదం జరిగిన చోటును పరిశీలించారు. రైల్వే ట్రాక్‎పై అమర్చిన దిమ్మెను స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ కుట్రలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విద్రోహ చర్యను సీరియస్ గా తీసుకున్న రైల్వే శాఖ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రైల్వే అధికారుల కంప్లైంట్ మేరక వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో పాటు.. ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దేశంలో ఇటీవల వరుస రైల్వే ప్రమాదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ట్రైన్ యాక్సిడెంట్లలో పలువురు మృతి చెందారు. ఈ తరుణంలో రైల్వే ప్రమాదాలకు వరుసగా కుట్రలు వెలుగు చూడటం దేశంలో సంచలనంగా మారింది.