ఆరోగ్యశ్రీ స్కీమ్‌ను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నరు: షర్మిల

ఆరోగ్యశ్రీ స్కీమ్‌ను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నరు: షర్మిల

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ స్కీమ్‌ను సీఎం కేసీఆర్ కోమాలోకి నెట్టారని వైఎస్సార్‌‌టీపీ చీఫ్‌ షర్మిల అన్నారు. 104 సేవలను ఇప్పటికే రద్దు చేసిన కేసీఆర్.. ఆరోగ్యశ్రీని సైతం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే హాస్పిటళ్లకు నిధులివ్వకుండా సైలెంట్‌గా ఆరోగ్యశ్రీని చంపే కుట్రకు కమిషన్‌రావు తెరతీశారని గురువారం ఒక ప్రకటనలో ఫైర్‌‌ అయ్యారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా, పేదవాడి ప్రాణాలకు విలువ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ మంచి స్కీమ్ అని, దీనిని ప్రభుత్వం బ్రహ్మాండంగా అమలు చేస్తదని అసెంబ్లీలో చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు. 

కేసీఆర్ మాటలు కోటలు దాటుతయ్, కానీ చేతలు మాత్రం ఆయన గడి దాటవన్నారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్‌ చూసినా ఆరోగ్యశ్రీ కేసులకు ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నారు. పేదవాడికి కార్పొరేట్ వైద్యం కోసం పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సర్కార్ దవాఖానాలకు మాత్రమే పరిమితం చేయడం అంటే ఈ స్కీమ్‌ను నీరుగార్చినట్లేనన్నారు. “కేసీఆర్‌‌కు జ్వరం వస్తే కార్పొరేట్‌కి పోతారు. మరి పేదవాడికి రోగమొస్తే కాటికి పోవాల్సిందేనా? పేదవాడికి కార్పొరేట్ వైద్యం కోసం రూ.800 కోట్లు ఇవ్వలేరా?”అని షర్మిల ప్రశ్నించారు.