- స్టూడెంట్లు వస్తే రీ ఓపెన్
- సర్కారు బడులపై విద్యా శాఖ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్టూడెంట్లు లేక బోసిపోయిన సర్కారు బడులపై విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు, టీచర్లు ఎవరూ లేని 1,441 స్కూళ్లను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం వెనకబడిపోతుండడం, జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్ల జాబితాలో దేశంలోనే మన రాష్ట్రం టాప్ ప్లేస్ లో ఉండడంతో విద్యా శాఖ చర్యలు చేపట్టింది.
వచ్చే విద్యా సంవత్సరం (2026–27) యూడైస్ లెక్కల నుంచి 1,441 స్కూళ్లను తొలగించనున్నారు. అయితే, పిల్లలు వస్తే.. మళ్లీ వాటిని రీఓపెన్ చేయనున్నారు. రాష్ట్రంలో మరో 600 స్కూళ్లలో టీచర్ పోస్టులు ఉన్నా.. చదువుకోవడానికి ఒక్క విద్యార్థి కూడా లేడు. దీంతో ఆయా బడుల్లోని టీచర్లను.. విద్యార్థులు ఎక్కువగా ఉండి, టీచర్ల కొరత ఉన్న ఇతర స్కూళ్లకు డిప్యూటేషన్ పై పంపించారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జులైలో రిలీజ్ చేసిన డేటాలో.. పిల్లలు లేని స్కూళ్ల జాబితాలో పశ్చిమ బెంగాల్ తొలిస్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
తాజాగా కేంద్రం ప్రకటించిన జీరో ఎన్ రోల్ మెంట్ జాబితాలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందని ప్రకటించింది. ఈ 'జీరో' స్కూళ్లు రికార్డుల్లో ఉండటంతో రాష్ట్ర పీజీఐ ర్యాంకింగ్ పడిపోతోంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు.. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించారు.
