అమెరికాను వీడితే రూ.2.7 లక్షలు.. అక్రమ వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం క్రిస్మస్ ఆఫర్

అమెరికాను వీడితే రూ.2.7 లక్షలు.. అక్రమ వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం క్రిస్మస్ ఆఫర్
  • లేకపోతే తామే అరెస్టు చేసి డిపోర్ట్  చేస్తామని వార్నింగ్
  • మళ్లీ యూఎస్​లో అడుగుపెట్టే అవకాశం ఉండదని వెల్లడి

అక్రమ వలసదారులకు డొనాల్డ్ ట్రంప్  ప్రభుత్వం క్రిస్మస్  ఆఫర్ ప్రకటించింది. ఈ నెలాఖరులోపు స్వచ్ఛందంగా అమెరికాను వీడి వెళితే 3 వేల డాలర్లు (రూ.2.70 లక్షలు) ఇస్తామని తెలిపింది. ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తామని వెల్లడించింది.

వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు డొనాల్డ్ ట్రంప్  ప్రభుత్వం క్రిస్మస్  ఆఫర్ ప్రకటించింది. ఈ నెలాఖరులోపు స్వచ్ఛందంగా అమెరికాను విడిచిపెడితే 3 వేల డాలర్లు (రూ.2.70 లక్షలు) ఇస్తామని తెలిపింది. ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తామని వెల్లడించింది. ఈమేరకు డిపార్ట్ మెంట్  ఆఫ్  హోంల్యాండ్  సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఒక ప్రకటన విడుదల చేసింది. 

‘‘ఈ నెలాఖరులోపు కస్టమ్స్ అండ్  బార్డర్  ప్రొటెక్షన్(సీబీపీ) హోం యాప్  ద్వారా సెల్ఫ్ డిపోర్ట్ అయ్యేవారికి 3 వేల డాలర్ల చొప్పున స్టైపెండ్ ఇస్తాం. గతంలో నమోదైన కేసులు కొట్టేస్తం, ఫైన్లను రద్దుచేస్తం. మీరు చేయాల్సిందల్లా సీబీపీ యాప్​ను డౌన్ లోడ్  చేసుకుని అవసరమైన సమాచారం నింపాలి. మిగతాదంతా మేము చూసుకుంటాం. ఈ ఆఫర్​కు ఒప్పుకుని మీ స్వదేశానికి వెళితే సరే లేదంటే అక్రమంగా అమెరికాలో ఉంటున్నందుకు అరెస్టు చేసి డిపోర్ట్  చేస్తాం. మళ్లీ అమెరికాకు వచ్చే అవకాశం కూడా మీకుండదు” అని డీహెచ్ఎస్  ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. 

డిపోర్టేషన్​ను మరింత వేగవంతం చేయడంలో భాగంగా ట్రంప్  సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. సెల్ఫ్ డిపోర్ట్  అయ్యేవారికి ఈ ఏడాది మే నెలలో వెయ్యి డాలర్లను ఆఫర్  చేసిన ప్రభుత్వం.. తాజాగా దానిని 3 వేల డాలర్లకు పెంచింది. కాగా, ఇప్పటివరకూ 
19 లక్షల మంది అక్రమ వలసదారులు సెల్ఫ్ డిపోర్ట్ అయ్యారని డీహెచ్ఎస్ వెల్లడించింది.