ఏడు వేల కోట్లలో ప్రతి రూపాయికీ లెక్క చెప్త : మంత్రి ఉత్తమ్

ఏడు వేల కోట్లలో  ప్రతి రూపాయికీ లెక్క చెప్త : మంత్రి ఉత్తమ్
  • పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై హరీశ్​వి వికారపు మాటలు:  మంత్రి ఉత్తమ్​
  •     17 లక్షల క్యూబిక్​ మీటర్ల ఎర్త్​ పనులు, 7 లక్షల క్యూబిక్​ మీటర్ల కాంక్రీట్ వర్క్స్​ పూర్తిచేసినం
  •     కేసీఆర్​ హయాంలో పూర్తయింది ఒక్క పంపే
  •     మేం వచ్చాక మరో 11 పంపులను పూర్తి చేసినం.. త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై హరీశ్​రావు విచిత్ర, వికారపు మాటలు మాట్లాడుతున్నారని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. కమీషన్ల విషయంలో హరీశ్​ రావులాగానే అందరూ ఉంటారని అనుకోవడం పొరపాటన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.7 వేల కోట్లలో ప్రతి రూపాయికీ లెక్క చెప్తామన్నారు. కమీషన్లు ఆయనకు అలవాటేమోగానీ.. తనకు కాదన్నారు. ఆయన అలవాట్లే అందరికీ ఉంటాయనుకోవద్దన్నారు. పాత జ్ఞాపకాలేమైనా హరీశ్​కు ఉన్నాయేమోనని ఎద్దేవా చేశారు. 

తాము చాలా సిన్సియర్​గా, కమిటెడ్​గా, రాష్ట్రానికి మేలు చేసేలా పనిచేస్తున్నామని చెప్పారు. ఇంటర్​స్టేట్​ఇష్యూస్​ సహా ఇరిగేషన్​ శాఖను బీఆర్ఎస్​ ఖతం పట్టించిందని విమర్శించారు. అసెంబ్లీలో పవర్​పాయింట్​ ప్రజెంటేషన్​కు అవకాశమిస్తే ఏం చెప్తారని ఉత్తమ్​ప్రశ్నించారు. కృష్ణా నీళ్లన్నీ ఆంధ్రకే ఇచ్చి వచ్చామని చెబుతారా? అని మండిపడ్డారు. 

మంగళవారం ఆయన సెక్రటేరియెట్​లో మీడియాతో మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టుకు బీఆర్ఎస్​ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదన్నారు. బీఆర్ఎస్​ హయాంలో ప్రాజెక్టు ఖర్చును రూ.55,088 కోట్లకు పెంచారని, సీడబ్ల్యూసీకి సమర్పించిన డీపీఆర్​లోనే ఆ అంశాన్ని పేర్కొన్నారని గుర్తుచేశారు. అయితే, అందులో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, భూసేకరణ, పరిహారం ఖర్చును మెన్షన్​ చేయలేదని, ఆ తర్వాత రివైజ్డ్​ డీపీఆర్​లో వాటికి మరో రూ.3 వేల కోట్లుగా పేర్కొన్నారని చెప్పారు. 

ఇప్పుడు ఇంకా 30 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని, ఇప్పుడున్న ధరలతో డిస్ట్రిబ్యూటరీలు, భూసేకరణ, పరిహారానికే రూ.6 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇప్పటివరకు బీఆర్​ఎస్​ వాళ్లు డిస్ట్రిబ్యూటరీలు నిర్మించలేదని, తట్టెడు మట్టి తీయలేదన్నారు. వాళ్లు ఇప్పటివరకు పూర్తి చేసింది 35 శాతం పనులేనని.. కానీ, 90 శాతం పూర్తి చేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 

చాలా పనులు చేసినం

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రెండేండ్లలో రూ.7 వేల కోట్లు పెట్టి పనులు చేశామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. 17 లక్షల క్యూబిక్​ మీటర్ల ఎర్త్​ వర్క్, 7 లక్షల క్యూబిక్​మీటర్ల కాంక్రీట్​వర్క్​చేశామని తెలిపారు. 9 కిలో మీటర్ల మేర ప్రెజర్​మెయిన్స్​ పనులు చేసినట్టు చెప్పారు. బీఆర్ఎస్​ హయాంలో ఒకే ఒక పంప్​ను పూర్తి చేశారని.. కానీ, కాంగ్రెస్​ వచ్చాక మరో 11 పంపులను పూర్తి చేశామని, అవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ‘‘ప్రాజెక్టుకు అన్ని అనుమతులు పొందామని కేసీఆర్​అంటున్నారు. కానీ, దానికి హైడ్రాలజీ (నీటి కేటాయింపులు) అనుమతి లేదు. ఎన్విరాన్మెంట్​క్లియరెన్స్​లేదు. ఇరిగేషన్​ ప్లానింగ్, బెనిఫిట్​ కాస్ట్​రేషియో, అంతర్రాష్ట్ర అనుమతులు లేవు. మరి, వాళ్లు ఏ లెక్కన అనుమతులు తెచ్చినం అని చెప్తున్నారు?”అని ఉత్తమ్​ప్రశ్నించారు. 

వాటిని నిర్లక్ష్యం చేసిన్రు

బీఆర్​ఎస్​ పదేండ్ల హయాంలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్​సాగర్​ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఉత్తమ్​ ఆరోపించారు. వాటిని తమ ప్రభుత్వంలోనే పూర్తి చేస్తామన్నారు. ‘‘ఉమ్మడి మహబూబ్​నగర్, నల్గొండ జిల్లాల మీద అంత పగ ఎందుకు? వాటిని కాదని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకంత ప్రేమ?’’ అని ఆయన మండిపడ్డారు. 

నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను స్లో చేయాలని 2020లోనే బీఆర్​ఎస్​ ప్రభుత్వ పెద్దలు అప్పటి ఈఎన్​సీని ఆదేశించారన్నారు. దీంతో ప్రాజెక్ట్​ ఇంజనీర్లకు ఈఎన్​సీ కూడా ఆదేశాలిచ్చారని, తద్వారా పెద్ద కుట్రకు తెరదీశారని మండిపడ్డారు. ప్రాజెక్టు లిఫ్టింగ్​ కెపాసిటీని ఒక్క టీఎంసీకి తగ్గించాలంటూ 2020 ఏప్రిల్​ 8న నాటి ఈఎన్​సీ మురళీధర్​ ఉత్తర్వులిచ్చారని గుర్తు చేశారు. 

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధిక జలాలను తమ హయాంలోనే వినియోగించామని.. 288 టీఎంసీలు వాడామని చెప్పారు. పదేండ్లు తాత్కాలిక ఒప్పందం ప్రకారం 33:64 వాటాకు ఒప్పుకోవడమే కాకుండా.. బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్​ కేటాయింపులు అయ్యేదాకా అదే వాటాకూ కేసీఆర్​ ఒప్పుకున్నారని మండిపడ్డారు. కానీ, తాము అధికారంలోకి వచ్చాక క్యాచ్​మెంట్​ ఏరియా ప్రకారం 70 శాతం నీళ్లు మనకే రావాలని ట్రిబ్యునల్​లో పోరాడుతున్నామన్నారు.