
- చట్ట సవరణలతో ఆస్తులు లాక్కోవాలని చూస్తున్నరు: అసద్
హైదరాబాద్, వెలుగు: వక్ఫ్ అధికారాలను పరిమితం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. వక్ఫ్ చట్టానికి ప్రతిపాదించిన సవరణలతో ముస్లింల నుంచి వక్ఫ్ ఆస్తులను లాక్కోవాలని, మత స్వేచ్ఛకు భంగం కలిగించాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నదని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో అసదుద్దీన్ మీడియాతో మాట్లాడారు.
‘‘వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. వక్ఫ్ స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా బిల్లు ఉన్నట్లు కథనాలతో స్పష్టమవుతున్నది’’అని అసద్ అన్నారు. “ఒక ఆస్తిపై వివాదాలు తలెత్తితే.. న్యాయ వ్యవస్థ పరిశీలిస్తది. రాజకీయ కార్యవర్గం ఎలా పరిష్కరిస్తది? సర్వేతో వివాదాలు సృష్టించాలని మోదీ ప్రభుత్వం చూస్తున్నది. వక్ఫ్ ఆస్తులు లాక్కోవడానికి బీజేపీ మిత్రపక్షాలు అనుమతిస్తాయో.. లేదో.. తేల్చుకోవాలి. బీహార్, ఏపీలో చాలా వక్ఫ్ ఆస్తులున్నయ్. ఈ ఆస్తులను లాక్కోవడానికి బీజేపీ సర్కార్కు అనుమతిస్తారా?’’ అని ఒవైసీ ప్రశ్నించారు.