- షార్జేజ్, అనవసర వినియోగంపై చెక్
నిజామాబాద్, వెలుగు: యాసంగి సీజన్‌కు సంబంధించి యూరియా అమ్మకాలు సోమవారం నుంచి మొబైల్ యాప్ ద్వారా జరుగనున్నాయి. యాప్‌ద్వారా బుకింగ్ చేసుకునేందుకు గ్రామపాలనాధికారులు రైతులకు సహకరించనున్నారు. ఇందుకోసం యువజన, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధుల సేవలను కూడా వినియోగించుకోనున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు, ఏ పంట వేశారన్న అంశాన్ని బట్టి యూరియా బ్యాగ్‌లు ఇస్తారు. జిల్లాలో యాసంగి సీజన్లో 5,22,730 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు.
ఇందులో 4,31,042 ఎకరాల్లో సన్న రకం వరి, 60,793 ఎకరాల్లో దొడ్డురకం వరి, 25,202 ఎకరాల్లో మొక్కజొన్న , 11,987 ఎకరాల్లో సజ్జలు, 1,869 ఎకరాల్లో జొన్న , 24,867 ఎకరాల్లో గడ్డి జొన్న, 14,679 ఎకరాల్లో శనగ, 8,239 ఎకరాల్లో నువ్వులు, 1,265 ఎకరాల్లో సన్ ఫ్లవర్, 2,065 ఎకరాల్లో పొగాకు, 773 ఎకరాల్లో మినుము , 213 ఎకరాల్లో సోయాబీన్సాగు చేయనున్నారు. సీజన్ అవసరాల కోసం సీడ్, యూరియా, కాంప్లెక్స్ ఎరువుల ఇండెంట్ఇదివరకే సర్కార్‌కు పంపారు. జిల్లాకు 82 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ఇండెంట్ పెట్టారు. రెండు వారాల నుంచి జిల్లాలో వరినాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 38 వేల టన్నుల యూరియా అమ్మకం జరిగింది.
390 మంది డీలర్ల వద్ద 12 వేల టన్నుల స్టాక్ఉంది. మరో 32 వేల టన్నుల సరుకు రావాల్సిఉంది. యూరియా కొరత ఏర్పడుతుందన్న ఆందోళనతో రైతులు సీజన్ మొత్తానికి అవసరమైన యూరియా బస్తాలు ఒకేసారి స్టాక్ చేసుకోవడంవల్ల కొరత ఏర్పడుతుంది. ఎప్పుడు ఎంత అవసరమో అంత కొనుగోలు చేస్తే అందరికీ యూరియా ఇబ్బందిలేకుంగా అదుతుంది. గత సీజన్లో తలెత్తిన పరిస్థితి పునరావృతం కాకుండా యాప్ బుకింగ్ అమలు చేయనున్నారు.
అవసరానికి మించి ఇవ్వరు
వరి పంట నాట్లు, పిలక దశ, పొట్టదశలో ఒక్కో బస్తా చొప్పున ఎకరానికి 3 బస్తాల యూరియా పంపిణీ చేస్తారు. రెండెకరాల వరకు భూమి ఉన్న రైతుకు ఒకేసారి 3 బ్యాగ్‌ల చొప్పున ఇస్తారు. 3 ఎకరాలు మించితే రెండు దఫాలు, ఐదెకరాలు, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్నవారికి మూడు దఫాలుగా యూరియా ఇస్తారు.
రైతు సాగు చేస్తున్న పంట, భూమి విస్తీర్ణం యాప్‌లో నమోదు చేయగానే ఆయనకు దగ్గరలో ఎక్కడ సరుకు ఉందో యాప్‌లో వివరాలు కనిపిస్తాయి. దాని ఆధారంగా డైరెక్ట్‌గా వెళ్లి బస్తాలు తీసుకోవచ్చు. యూరియా కోసం ఎక్కడా క్యూలు కట్టాల్సిన అవసరం ఉండదు.
కొరతకు చెక్
లోపాలు లేకుండా.. కొరతకు అవకాశం లేకుండా యాప్ ద్వారా యూరియా అమ్మకాలు విప్లవాత్మక మార్పునకు నాంది కానుంది. యూరియా దుర్వినియోగం, అధిక వినియోగం, బస్తాల కోసం క్యూ కట్టడం వంటి సమస్యలకు యాప్ పరిష్కారంగా నిలుస్తుంది. బుకింగ్‌లో స్వచ్చంద సంస్థలు రైతులకు సహాయం చేస్తాయి. - వీరాస్వామి, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్
