ఇవాళ (డిసెంబర్ 29) అసెంబ్లీకి కేసీఆర్.. 9 నెలల తర్వాత రాక..!

ఇవాళ (డిసెంబర్ 29) అసెంబ్లీకి కేసీఆర్.. 9 నెలల తర్వాత రాక..!

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​అధినేత, అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్​అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. 9 నెలల తర్వాత ఆయన సభ గడప తొక్కనున్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్​ కేవలం రెండుసార్లే అసెంబ్లీకి వచ్చారు. చివరిసారిగా ఆయన ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన బడ్జెట్​సెషన్‎కు హాజరయ్యారు. మార్చి 12న గవర్నర్​ప్రసంగం రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్​.. దాదాపు 40 నిమిషాలపాటు సభలో గడిపారు. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ వైపు చూడలేదు. కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​రిపోర్టుపై చర్చ సందర్భంగా ఆగస్టు 30, 31, సెప్టెంబర్​ 1న నిర్వహించిన సెషన్‎కు ఆయన హాజరు కాలేదు. 

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఇష్యూ నేపథ్యంలో.. ఇటీవల కేసీఆర్​తెలంగాణ భవన్‎లో బీఆర్ఎస్​నేతలతో సమావేశం నిర్వహించారు. ఇక తానే రంగంలోకి దిగుతానని, తోలు తీస్తానంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా నీళ్ల వాటాలు, గోదావరి జలాలపై చర్చించేందుకు ప్రభుత్వం సోమవారం నుంచి అసెంబ్లీ సెషన్​ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసి పెట్టుకున్నాయి. సభలో పాల్గొనేందుకు కేసీఆర్​ఆదివారం మధ్యాహ్నమే ఎర్రవల్లి ఫామ్​హౌస్​ నుంచి బయల్దేరి బంజారాహిల్స్​ నందినగర్​లోని తన నివాసానికి చేరుకున్నారు. 

చర్చల్లో పాల్గొంటరా..?

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​హాజరైనా.. కృష్ణా జలాలపై చర్చల్లో పాల్గొంటారా లేదా అనే దానిపై సందేహాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి సభను కనీసం ప్రతి ఆరు నెలలకోసారైనా నిర్వహించాలన్న రూల్​ఉంది. దాని ప్రకారమే ఎమ్మెల్యేలు కూడా కనీసం ఆరు నెలలకోసారైనా వచ్చి సంతకం పెట్టాల్సి ఉంటుంది. చివరిసారిగా మార్చి 12న అసెంబ్లీకి హాజరైన కేసీఆర్.. ఆ తర్వాత ఆరునెలలకు ఆగస్టులో నిర్వహించిన సమావేశాలకు మాత్రం హాజరు కాలేదు. దీంతో సంతకం కూడా చేయలేదు.