- గతంలో ఒక్కరోజే పెట్టిండ్రు.. ఇప్పుడూ రెండు, మూడు రోజులు పెడ్తరా?
- నెల రోజులు సభ నడిపే దమ్ము సర్కార్‌కు లేదా?: ఏలేటి
- కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీలు అటకెక్కినయ్ అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: శాసనసభ వ్యవస్థను రేవంత్ రెడ్డి సర్కార్ అపహాస్యం చేస్తున్నదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సభలో చర్చించాలంటే ప్రభుత్వానికి వణుకు పుడుతున్నదన్నారు. అందుకే మొన్న మాన్సూన్ సెషన్‌ను ఒక్కరోజుతో సరిపెట్టి.. ఇప్పుడు శీతాకాల సమావేశాలను కూడా రెండు మూడు రోజుల్లోనే ముగించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని.. ఇప్పటి వరకు ఎన్ని రోజులు నడుపుతారనేదానిపై క్లారిటీ ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయడమేనన్నారు.
బీఏసీలో మాట్లాడి నిర్ణయిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆదివారం ఆయన ఎమ్మెల్యేలు వెంకటరమణా రెడ్డి, రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది ప్రజల సమస్యలపై చర్చించే వేదికని, కానీ.. రేవంత్ ప్రభుత్వం దాన్ని నామమాత్రంగా మార్చేసిందని మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ పద్ధతిలో కనీసం నెల రోజుల పాటు, లేదా 20 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నదన్నారు.
రైతు సమస్యలు, రుణమాఫీ, 6 గ్యారంటీలపై అసెంబ్లీలో చర్చించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల బతుకులు ఆగమయ్యాయని చెప్పారు. రుణమాఫీ సగమే అయిందని, వానాకాలం పంట నష్టపరిహారం అందలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన సీఎం.. ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా పెట్టలేదని విమర్శించారు.
