8 ఏళ్ల క్రితం సస్పెన్షన్.. ఆర్థిక ఇబ్బందులు.. కానిస్టేబుల్ సూసైడ్ అటెంప్ట్

8 ఏళ్ల క్రితం సస్పెన్షన్.. ఆర్థిక ఇబ్బందులు.. కానిస్టేబుల్ సూసైడ్ అటెంప్ట్

పద్మారావునగర్, వెలుగు: ఎనిమిదేళ్ల క్రితం సస్పెండ్​ అయిన కానిస్టేబుల్​ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చిలకలగూడ పోలీసులు తెలిపిన ప్రకారం.. 2010 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ టి.కిరణ్(40) మీర్ చౌక్ పోలీస్ స్టేషన్  కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ 8 ఏళ్ల క్రితం సస్పెండ్ అయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. 

మనోవేదనకు గురైన ఆయన సోమవారం రాత్రి చిలకలగూడ మోహన రెడ్డి నగర్ లోని తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు మంటలను ఆర్పారు. అప్పటికే 60 శాతం గాయాలు కాగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కానిస్టేబుల్​కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.