డీజీపీ కార్యాలయం ముందు కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

డీజీపీ కార్యాలయం ముందు కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో తప్పుగా వచ్చిన  ప్రశ్నలకు  మార్కులు కలపాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇటీవల జరిగిన ఎస్సై కానిస్టేబుల్ పరీక్ష పేపర్లో గందరగోళం జరిగిందని ఆరోపించారు. కానిస్టేబుల్ పరీక్షా పేపర్లో 22 ప్రశ్నలు తప్పు ఇచ్చారని, ఎస్సై పరీక్షా పేపర్లో 7 మల్టీపుల్ ప్రశ్నలు తప్పుగా ఇచ్చారని తెలిపారు. నెగిటివ్ మార్కులు పెట్టి అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను సైతం అమలు చెయ్యడం లేదన్నారు.

తమ సమస్యలు తెలియజేయడానికి పోలీస్ రీక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్ రావును కలవడానికి వచ్చామని కానిస్టేబుల్ అభ్యర్థులు చెప్పారు. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలో క్వాలిఫై మార్కులు వచ్చినా లిస్ట్ లో పేరు మాత్రం లేదని ఆరోపించారు. ఇలాంటి ఇబ్బందులతో ఇప్పటికే 8 మంది అభ్యర్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని తెలిపారు. 12 రోజుల నుండి తిరుగుతున్నామన్న వారు.. 6 లక్షల 3 వేల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు పరీక్ష రాశారన్నారు. అందులో లక్షా 90 వేల మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని చెప్పారు. ఎస్సై 2 లక్షల 50 మంది పరీక్ష రాయగా.. 1 లక్ష 5 వేల మంది క్వాలిఫై అయ్యారని తెలిపారు. మిగిలిన వారి పరిస్థితి ఏంటి మరి అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.