
- 80 వేల మంది కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు
- ఫైనల్ రిజల్ట్ వచ్చి మూడు నెలలు
- తుది జాబితా మాత్రం ప్రకటించని బోర్డు
- 15 నెలలుగా సాగుతున్న రిక్రూట్‌మెంట్ ప్రహసనం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కిందటేడాది చేపట్టిన కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రహసనంగా మారింది. 15 నెలల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. పోస్టుల భర్తీని ఇంకా పూర్తి చేయలేదు. ఫైనల్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన సుమారు 80 వేల మంది కేండిడేట్లు మెరిట్ లిస్ట్ కోసం మూడు నెలలుగా ఎదురు చూస్తున్నారు.
2018 మే 31న నోటిఫికేషన్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,925 పోస్టుల భర్తీ కోసం 2018, మే 31న పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ పీసీ పోస్టులు 5,909, ఏఆర్ 5,273, ఎస్‌ఏఆర్ సీపీఎల్ పోస్టులు 53, టీఎస్‌ఎస్‌పీ పీసీ పోస్టులు 4,816, ఎస్పీఎఫ్‌లో 485, ఫైర్ సర్వీసెస్‌లో 168, జైలు వార్డర్(మేల్) పోస్టులు 186, జైలు వార్డర్ ఫిమేల్ పోస్టులు 35 భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుల కోసం సుమారు 5 లక్షల మంది ప్రిలిమినరీ ఎగ్జామ్ రాశారు. వారిలో 2.8 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఫిజికల్ ఈవెంట్స్ టెస్ట్‌ల్లో సుమారు 1.2 లక్షల మంది అర్హత సాధించారు. వారికి ఈ ఏడాది ఏప్రిల్ 28న ఫైనల్ ఎగ్జామ్ నిర్వహించిన బోర్డు మే 20న ఫలితాలు ప్రకటించింది. వారిలో సుమారు 80 వేల మంది క్వాలిఫై అయ్యారు. వీరంతా మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. కటాఫ్ మార్కుల వివరాలు ప్రకటిస్తే తమకు ఉద్యోగం వస్తుందో రాదో తేలిపోతుందని, ఉద్యోగం వచ్చే పరిస్థితి లేకుంటే మరో ఉద్యోగం కోసమైనా ప్రయత్నాలు చేసుకుంటామని, లేదంటే ఇంకేదైనా పని చేసుకుంటామని కేండిడేట్లు వాపోతున్నారు.
ట్రైనింగ్ సెంటర్ల ఎంపికలోనే జాప్యం?
ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఉమ్మడి 10 జిల్లా కేంద్రాల్లో మాత్రమే ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో సెంటర్లో వెయ్యి మంది చొప్పున మొత్తంగా పది వేల మందికి మాత్రమే శిక్షణ ఇచ్చే సౌకర్యం ఉంది. మిగతా ఏడు వేల మందికి రాష్ట్రంలో ట్రైనింగ్ ఇవ్వడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పిచేందుకు అక్కడి పోలీస్ ఉన్నతాధికారులతో రాష్ట్ర అధికారులు సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పీటీసీల్లో ఎలాంటి ట్రైనింగ్‌లు లేకపోవడంతో వారు కూడా సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ట్రైనింగ్‌కు సంబంధించిన సెంటర్ల విషయంలో క్లారిటీ వచ్చాకే మెరిట్ లిస్ట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.