
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఘటన
సత్తుపల్లి, వెలుగు : కుటుంబకలహాలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ములుగు జిల్లాకు చెందిన అల్లం బాలరాజు (40) సత్తుపల్లి 15వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ బేతుపల్లి గ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. భార్యతో గొడవలు జరగడంతో ఏడాది కింద ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాలరాజు ఒక్కడే ఉంటున్నాడు.
అతడు ఉంటున్న ఇంటి నుంచి మంగళవారం దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ బెటాలియన్ అధికారులకు, పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించాడు. డెడ్‌బాడీ కుళ్లిపోవడంతో రెండు రోజుల కిందే ఉరి వేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.