యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌‌

యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌‌
  • యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌‌
  • అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి
  • భుజాలపై మోస్తూ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లిన కానిస్టేబుల్‌‌

జహీరాబాద్, వెలుగు : అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడికి వెహికల్స్‌‌ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఓ కానిస్టేబుల్‌‌ కిలోమీటర్‌‌ దూరం భుజాలపై మోసుకుంటూ వచ్చి హాస్పిటల్‌‌కు తరలించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అల్గోల్‌‌లో సోమవారం వెలుగు చూసింది. అల్గోల్‌‌ గ్రామానికి చెందిన మహేశ్వరి ఆదివారం రాత్రి 100కు ఫోన్‌‌ చేసి తన అన్న రాజు ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్‌‌ చేశాడని, తర్వాత తాను ఫోన్‌‌ చేస్తే లిఫ్ట్‌‌ చేయడం లేదని పోలీసులకు చెప్పింది.

దీంతో విషయం తెలుసుకున్న జహీరాబాద్‌‌ పోలీసులు ఫోన్‌‌ సిగ్నల్స్‌‌ ఆధారంగా రాజు అల్గోల్ అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.  అక్కడికి వెహికల్స్‌‌ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కానిస్టేబుల్‌‌ నాయిని జైపాల్, రాజు చెల్లెలు మహేశ్వరి, వారి బంధువు కలిసి కిలోమీటర్‌‌ దూరం నడుచుకుంటూ వెళ్లారు. అప్పటికే రాజు మద్యంలో విషం కలుపుకొని తాగాడు. దీంతో కానిస్టేబుల్‌‌ జైపాల్‌‌ తన భుజంపై రాజును మోసుకుంటూ రోడ్డు వరకు తీసుకొచ్చి, అక్కడి నుంచి పోలీస్‌‌ వాహనంలో జహీరాబాద్ హాస్పిటల్‌‌కు తరలించారు.

డాక్టర్లు ట్రీట్‌‌మెంట్‌‌ చేయడంతో రాజు ప్రాణాలతో బయటపడ్డాడు. కానిస్టేబుల్‌‌ జైపాల్‌‌ను డీఎస్పీ రఘు, సీఐ భూపతి, ఎస్సై శ్రీకాంత్‌‌ అభినందించారు.