
కామారెడ్డి: తహసీల్దార్ విజయారెడ్డి ఘటన మరవకముందే మరో ఆర్డీవోకి అదే రీతిలో బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనకు అనుకూలంగా పాస్‌బుక్కులు ఇవ్వకపోతే ‘విజయారెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది’ అంటూ ఏకంగా ఆర్డీవోనే బెదిరించాడో ప్రబుద్ధుడు. తాడ్వాయి మండలానికి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి గొడవల్లో ఉన్న భూమికి సంబంధించి తనకు అనుకూలంగా పాస్‌బుక్కులు ఇవ్వాలని ఆర్డీవో రాజేంద్రకుమార్‌ను కోరాడు. దీనికి ఆర్డీవో అంగీకరించలేదు. దీన్ని మనసులో పెట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఆర్డీవోకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ ఘటనపై ఆర్డీవో రాజేంద్రకుమార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక ప్రభుత్వోద్యోగిని మరో ప్రభుత్వోద్యోగి బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ అధికారులకు ఇలాంటి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో అన్నీ రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు కోరుతున్నారు.