గ్రేటర్​లో ఘనంగా సంవిధాన్ దివస్

గ్రేటర్​లో ఘనంగా సంవిధాన్ దివస్

హైదరాబాద్/గండిపేట/శామీర్ పేట/: గ్రేటర్ వ్యాప్తంగా  శనివారం  ప్రభుత్వ ఆఫీసులు, పలు ప్రాంతాల్లో భారత రాజ్యాంగ దినోత్సవం(సంవిధాన్ దివస్), ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపెయిన్​ను  నిర్వహించారు.  బల్దియా హెడ్డాఫీసులో కమిషనర్ లోకేశ్ కుమార్,  వాటర్ బోర్డు హెడ్డాఫీసులో ఎండీ దానకిశోర్ అధికారులతో  ప్రతిజ్ఞ చేయించారు. హిమాయత్​సాగర్​లోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలోనూ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు పోలీసులు, సిబ్బందితో రాజ్యాంగ పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు.  బాగ్​లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో ‘కానిస్టిట్యూషనల్ మొరాలిటీ’ అంశంపై సమావేశం నిర్వహించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నేషనల్ లా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీనాథ్ చీఫ్ గెస్టుగా హాజరై రాజ్యాంగం గురించి స్టూడెంట్లకు వివరించారు. అనంతరం లా కాలేజీ ఫ్యాకల్టీ రూపొందించిన ‘లా డే న్యూస్.. న్యూస్ లెటర్’ బుక్​ను రిలీజ్ చేశారు.

లా కాలేజీ ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ, స్టూడెంట్లు పాల్గొన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్​లో భాగంగా మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి  తూముకుంట, దేవరయంజాల్, మచ్చబొల్లారంలోని పోలింగ్ బూత్​లను సందర్శించారు. అనంతరం కలెక్టరేట్​లో నిర్వహించిన  రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీనగర్ డివిజన్​లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని కార్పొరేటర్ పావని పర్యవేక్షించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో కవులు, కళాకారుల చారిత్రాత్మక  పాటల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చీఫ్​గెస్టుగా హాజరైన ప్రజాగాయకుడు గద్దర్ ఆటపాటలతో అలరించారు. కొత్తగా నిర్మిస్తున్త పార్లమెంట్​  భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అడ్వొకేట్​ సంఘాల ప్రతినిధులు మినిస్టర్స్‌‌ క్వార్టర్స్‌‌లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్​ కుమార్​తో సమావేశమయ్యారు. రాజ్యాంగంతోనే దేశంలో ప్రజాస్వామ్యానికి గట్టి పునాదులు పడ్డాయని వినోద్​ తెలిపారు.