ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ తీర్పు న్యాయశాఖదే. ఏ ప్రభుత్వం అయినా న్యాయశాఖకు లోబడే తన విధులు నిర్వర్తించాలి. గ్రామ సర్పంచ్ నుంచి మొదలు ముఖ్యమంత్రి వరకు పంచాయతీ కార్యదర్శి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు అందరూ చట్టానికి లోబడే తమ విధులు నిర్వహించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత ముఖ్యమో, రూల్ ఆఫ్ లా అంతకంటే ముఖ్యమైనది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూడా చట్టానికి లోబడి ఉండాలనే భావనే రూల్ ఆఫ్ లా.
పాలకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, సాధారణ పౌరులు అందరూ ఒకేలా చట్టం పరిధిలో ఉండటం నాగరిక సమాజానికి మూలాధారం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ద్వారా చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రాన్ని ప్రకటించింది. ఈ సూత్రం కేవలం రాజ్యాంగంలోని పదాలు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడే బలమైన పునాది. అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయం, సాధారణ పౌరులకు మరో న్యాయం ఉండకూడదు.
చట్టం అందరికీ ఒకేవిధంగా వర్తించినప్పుడే ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది. రూల్ ఆఫ్ లా బలహీనపడినప్పుడు వ్యక్తి ఆధిపత్యం పెరుగుతుంది. అధికార దుర్వినియోగం, అవినీతి, పక్షపాతం, వివక్ష వంటి సమస్యలు విస్తరిస్తాయి. చివరికి ప్రజాస్వామ్యం తన అసలు స్ఫూర్తిని కోల్పోతుంది. అందుకే చట్టాలను అమలు చేసే సంస్థలు స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా పనిచేయడం అత్యంత అవసరం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు. కానీ ఆ చట్టాలకు మించిన అధికారం ప్రభుత్వానికి ఉండదు.
రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వ పాలన
ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రాజ్యాంగానికి, చట్టానికి అనుగుణంగా ఉండాలి. అదే రాజ్యాంగ పరిపాలనకు అసలైన అర్థం. రూల్ ఆఫ్ లా కేవలం కోర్టుల బాధ్యత మాత్రమే కాదు. చట్టాలను గౌరవించడం, పౌర విధులను నిర్వర్తించడం, ఇతరుల హక్కులను కాపాడడం ప్రతి పౌరుని బాధ్యత కూడా. ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, పరిపాలన, పౌర సమాజం కలిసి పనిచేసినప్పుడే ఈ సూత్రం బలపడుతుంది.
నేటి కాలంలో అభివృద్ధి, పెట్టుబడులు, సామాజిక న్యాయం, ప్రజల భద్రత ఇవన్నీ రూల్ ఆఫ్ లాపైనే ఆధారపడి ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానులనే విశ్వాసం ఉన్న దేశాలే స్థిరమైన అభివృద్ధిని సాధిస్తాయి. వ్యక్తుల పాలన తాత్కాలికం. చట్ట పాలన శాశ్వతం. రూల్ ఆఫ్ లా బలంగా ఉన్నప్పుడే రాజ్యాంగం సజీవంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం సార్థకమవుతుంది.
రిట్ పిటిషన్ ఆఫ్ మాండమస్
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 సుప్రీం కోర్టు, ఆర్టికల్ 226 హైకోర్టు ప్రకారం ప్రభుత్వ అధికారులు లేదా చట్టబద్ధమైన ప్రజా సంస్థలు తమ విధులను నిర్వర్తించకుండా విఫలమైనప్పుడు, వాటిని చట్టబద్ధమైన బాధ్యతలు నిర్వర్తించేలా కోర్టు జారీ చేసే ఆదేశాన్ని రిట్ ఆఫ్ మాండమస్ అంటారు. ఈ రిట్ ఉద్దేశ్యం ప్రభుత్వ యంత్రాంగం చట్టం ప్రకారం పనిచేసేలా చేయడం. ఒక పౌరునికి చట్టం కల్పించిన హక్కు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారి తన విధిని నిర్వర్తించకపోతే లేదా అనవసరంగా ఆలస్యం చేస్తే, బాధితుడు హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించి మాండమస్ రిట్ కోరవచ్చు.
ప్రజాస్వామ్యంలో రూల్ ఆఫ్ లా అమలుకు మాండమస్ రిట్ ఒక కీలకమైన రాజ్యాంగ ఆయుధం. ఇది అధికారులను చట్టానికి లోబడి పనిచేయించే సాధనం మాత్రమే కాకుండా, పౌరుల హక్కులను రక్షించే సమర్థవంతమైన న్యాయపరమైన మార్గం కూడా. ‘మీ పని మీరు చేయండని మేం చెప్పాలా’ అని రెవెన్యూ అధికారుల మీద హై కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు ఈ మధ్య చేయడం గమనార్హం.
కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసుల సంఖ్య 9,200
కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే న్యాయస్థానం గౌరవాన్ని దెబ్బతీయడం, న్యాయపరమైన ప్రక్రియకు ఆటంకం కలిగించడం లేదా కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించకపోవడం. ఐదేళ్లలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసుల సంఖ్య 9,200కు చేరిందని హైకోర్టు హెచ్చరించింది. ప్రస్తుత హైడ్రా కమిషనర్‌పై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసుల సంఖ్య 63 ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ గత ప్రభుత్వ హయాంలోనే అత్యధిక కంటెంప్ట్ ఆప్ కోర్ట్ కేసులు ఉన్నాయి.
గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, జిల్లా కలెక్టర్లు పెద్ద సంఖ్యలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులు ఎదుర్కొన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందులో అత్యధికంగా మాజీ చీఫ్ సెక్రటరీ 300 కేసులు, మాజీ మున్సిపల్ కమిషనర్ 53 కేసులు.. ఈ కేసుల పరిష్కారానికి న్యాయ పోరాటం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో ద్వారా రూ. 58 కోట్లు విడుదల చేసినట్టు వార్తలు ఉన్నాయి.
రాజ్యాంగం ప్రతీ పౌరుడికి హక్కులను కల్పించింది. ఆ హక్కులకు జీవం పోసేది రూల్ ఆఫ్ లా. వాటిని అమలు చేయించేది రిట్ ఆఫ్ మాండమస్. వాటిని నిర్లక్ష్యం చేసినప్పుడు బాధ్యతను గుర్తుచేసేది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు, పౌరులు అందరూ చట్టాన్ని గౌరవించాలి. వ్యక్తుల పాలన తాత్కాలికం. చట్ట పాలన శాశ్వతం. రూల్ ఆఫ్ లా బలంగా ఉన్నప్పుడే రాజ్యాంగం సజీవంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం సార్థకమవుతుంది.
బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడు
