
- గోపనపల్లిలో రంగనాథ స్వామి ఆలయ భూముల ఆక్రమణ
- రాత్రికి రాత్రే రహదారి అమాంతం పెకిలించిన దేవాదాయ శాఖ అధికారులు
గచ్చిబౌలి, వెలుగు: శేరిలింగంపల్లిలో బడా నిర్మాణ కంపెనీలు బరి తెగించాయి. రాత్రికి రాత్రే ఆలయ భూములను ఆక్రమించి రోడ్డును నిర్మించాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ అధికారులు.. వేసిన రోడ్డును జేసీబీతో అమాంతం పెకిలించారు. వివరాల్లోకి వెళ్తే..
శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో పురాతన రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయం కింద గోపనపల్లి వ్యాప్తంగా మాన్యం భూములు ఉన్నాయి. గోపనపల్లి గ్రామ సర్వే నంబరు 268లో సైతం13 ఎకరాల భూమి ఉండగా, దీనికి ఆనుకొని తెల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో పలు భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఈ నిర్మాణ సముదాయాలకు సరైన రోడ్డు లేకపోవడంతో.. నిర్మాణ సంస్థల చూపు పక్కనే ఉన్న రంగనాథ స్వామి మాన్యంపై పడింది. అందులో భాగంగా శనివారం అర్ధరాత్రి దేవుని మాన్యం భూమిని చదును చేసి రాత్రికి రాత్రే సీసీ రోడ్డు వేశారు. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని స్థానికులు గమనించి దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సంఘటనా స్థలికి చేరుకున్న ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, ఈవో సత్యచంద్రారెడ్డి రహదారి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో పాటు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రహదారి నిర్మాణంపై విచారణ చేపట్టారు. అనంతరం వేసిన సీసీ రోడ్డును జేసీబీతో పెకిలించి తొలగించడంతో పాటు ఈ దారిలో రాకపోకలు సాగకుండా కందకం ఏర్పాటు చేశారు. దేవుని మాన్యం భూముల ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.