
హైదరాబాద్ నగరంలోని ఓపెన్ నాలాలపై బాక్స్ డ్రైనేజీల నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై బాక్స్ డ్రైనేజీల కార్యక్రమాలు పూర్తి చేయాలని.. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. GHMC ఉన్నతాధికారులతో సోమవారం కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. క్యాపింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సుమారు రూ.300కోట్లు ఖర్చు అవుతాయని.. వీటన్నిటికీ త్వరలోనే పరిపాలనా పరమైన అనుమతులు ఇస్తామని చెప్పారు. ఇలాంటి భారీ కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. రెండు మీటర్ల కన్నా వెడల్పు ఉన్న నాళాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు కేటీఆర్.