సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
గజ్వేల్, వెలుగు: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దేశంలోనే అద్భుతమైన కట్టడమని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవారం మర్కూక్ మండలం కొండ పోచమ్మ రిజర్వాయర్ ను అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డితో కలసి సందర్శించారు. ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి ప్రాంతానికి నీరు వెళ్లే కెనాల్ ను పరిశీలించారు. ఇరిగేషన్ ఈఈ వేణును అడిగి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. కట్టపై సందర్శకులకు కల్పించిన సౌకర్యాలను ఈఈ వివరించారు. అనంతరం కొండపోచమ్మ సాగర్ లోకి నీళ్లు ఎత్తిపోసే పంప్ హౌస్ ను పరిశీలించారు. మోటార్లు ఎప్పటికప్పుడు చెక్ చేయాలని సంబంధిత ఆఫీసర్లకు కలెక్టర్ సూచించారు. అనంతరం ములుగు అటవీ కళాశాలలో మామిడ్యాల, బైలంపుర్, తానెదార్ పల్లి గ్రామాల ప్రజా ప్రతినిధులతో, అధికారులతో సమావేశం నిర్వహించారు. కొండపోచమ్మ సాగర్ నిర్మాణం సందర్భంగా భూమిని, ఊరిని, ఇళ్లను కోల్పోయి ఇంకా ఆయా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించారు. నిర్వాసితులకు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు.
మాతృభాషను మరువొద్దు
దుబ్బాక, వెలుగు: మాతృభాషను మరువొద్దని ఎమ్మెల్యే రఘునందన్‌రావు సూచించారు. శుక్రవారం దుబ్బాక మండలం రామక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తోన్న స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించిన మాలవత్ పూర్ణ, ఆనంద్ క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి దేశ ఔన్యాత్యాన్ని ప్రపంచ దేశాలకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. రానున్న ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థికి రూ. లక్ష విలువైన ఐఫోన్ గిఫ్ట్‌గా అందజేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత టీచర్లు, విద్యార్థులపైనే ఉందన్నారు. తెలంగాణ మాండలికాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత కాళోజీకే దక్కుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలో పని చేస్తున్న పార్ట్ టైమ్ టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అసెంబ్లీ సమావేశాల్లో గురుకుల విద్యార్థులు, టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు ఏర్పాట్లు
సంగారెడ్డి టౌన్, వెలుగు : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఈనెల 16 నుంచి 18 వరకు నిర్వహించి సక్సెస్ చేసేందుకు జిల్లాలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ రమణకుమార్ తో కలిసి వజ్రోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 14 నుంచి 18 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు. 16న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 15 వేల మందితో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ, 17న ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయాలని చెప్పారు. 18న సాంస్కృతిక కార్యక్రమాలను భారీగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.
వజ్రోత్సవాలను సక్సెస్ చేయాలి : ఎమ్మెల్యే
కోహెడ (హుస్నాబాద్), వెలుగు : జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను సక్సెస్ చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ ఎంపీడీవో ఆఫీస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల16న పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్, వైస్ చైర్మన్రాజిరెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీపీ సతీశ్, మున్సిపల్చైర్పర్సన్రజిత, ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
వినాయక నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన
మెదక్ టౌన్, వెలుగు : జిల్లాలో శనివారం నిర్వహించే వినాయక నిమజ్జనం కోసం మెదక్ మండలం కోంటూరు చెరువు వద్ద చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రశాంత వాతావరణం నిర్వహించాలి : ఎస్పీ
మెదక్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనం వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట రూరల్/కంది, వెలుగు: సురక్షిత ప్రయాణం కోసం ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని సిద్దిపేట డిపో మేనేజర్ కిషన్ రావు సూచించారు. శుక్రవారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సూచనతో నారాయణరావు పేట మండలం గుర్రాలగొంది గ్రామంలో ‘ప్రజల వద్దకు ఆర్టీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాతరాజుపల్లి ఆంజనేయులు, అసిస్టెంట్ మేనేజర్ అంజమ్మ, ఎంపీటీసీ ఆకుల హరీశ్, ఉప సర్పంచ్ సంజీవరెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో శుక్రవారం ఆర్ఎం సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విమల, ఎంపీటీసీ నందకిషోర్, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.
నీటి సంరక్షణ ప్లాన్‌ను పక్కాగా అమలు చేయాలి
సిద్దిపేట/ సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లాలో నీటి సంరక్షణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి భూగర్భ జలాలు పెంపునకు కృషి చేయాలని కేంద్ర జలశక్తి అభియాన్ డిప్యూటీ సెక్రటరీ విజయ్ దత్త సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లాలోని సిద్దిపేట అర్బన్, కొండపాక, మర్కూక్ మండలాల్లో సెంట్రల్ వాటర్ కమిషన్ టెక్నికల్ ఆఫీసర్ సందీప్ తో కలసి పర్యటించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను, మెగా విలేజీ పార్క్‌లను ప్లాంటేషన్, రూప్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, అటవీ ప్రాంతంలో పార్క్యు లేషన్ ట్యాంక్ లను, ఎస్ఎంసీ స్ట్రక్చర్ ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఆఫీస్‌లో గ్రామీణ అభివృద్ధి, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, దాని ద్వారా జిల్లాలో పెరిగిన భూగర్భ జలాల గురించి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వివరించారు. కేంద్ర జల శక్తి అధికారులు మాట్లాడుతూ డిస్టిక్ వాటర్ కన్జ ర్వేషన్ ప్లాన్ ను పక్కాగా అమలు చేయాలని సూచించారు. జిల్లాలో వాన నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు తీసుకున్న చర్యలపై ఫొటోలతో సహా ఎప్పటికప్పుడు జలశక్తి అభియాన్ కు నివేదిక అందించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్డీవో గోపాలరావు, డీఎఫ్ వో శ్రీధర్ రావు, డీపీవో దేవకీదేవి, జడ్పీ సీఈవో రమేశ్, జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ పాల్గొన్నారు.
తప్పుల్లేకుండా ఓటరు లిస్టును రూపొందించాలి
మెదక్ టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా తప్పుల్లేకుండా ఓటర్ల జాబితాను రూపొందించడానికి అందరూ సహకరించాలని అడిషనల్కలెక్టర్ ప్రతిమాసింగ్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఆమె చాంబర్లో భారత ఎన్నికల కమిషన్ ముద్రించిన ‘కచ్చితమైన వివరాలు ఇచ్చి తప్పుల్లేని ఓటర్ల జాబితాను బలోపేతం చేద్దాం’ అనే వాల్‌పోస్టర్‌ను స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డితో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటుకు ఎంతో విలువైందని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఫారం 6బీ ద్వారా ఓటరు కార్డకు ఆధార్‌లింక్ చేయాలన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
జహీరాబాద్, వెలుగు : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. శుక్రవారం కోహీర్ మండల కేంద్రంతోపాటు పైదిగుమ్మల్, సజ్జాపుర్, మనియర్పల్లి గ్రామాల్లో రూ.80 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమాల్లో ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, ఎఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మెంబర్ బంటు రామకృష్ణ, సర్పంచులు పాల్గొన్నారు.
ఘనంగా కాళోజీ జయంతి
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టరేట్లతోపాటు పలు ఆఫీసుల్లో ఘనంగా నిర్వహించారు. ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, మెదక్‌లో అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, సిద్దిపేటలో సీపీ ఎన్. శ్వేత, అసిస్టెంట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆయా పట్టణాల్లో పలువురు అధికారులు మాట్లాడారు. కాళోజీ జీవితం అంతా తెలంగాణ భాష, సాహితీ సేవ దిశగా సాగిందని కొనియాడారు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. - వెలుగు, నెట్వర్క్
గణపతి షుగర్ ఫ్యాక్టరీలాకౌట్ ఎత్తేయాలి
సంగారెడ్డి టౌన్, వెలుగు : గణపతి షుగర్‌ఫ్యాక్టరీ అక్రమ లాకౌట్ వెంటనే ఎత్తేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ లాకౌట్ కావడంతో ఆర్థిక ఇబ్బందులతో పర్మినెంట్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమ లాకౌట్ తో రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పరిశ్రమ జీఎంతో ఫోన్లో మాట్లాడితే మంగళవారం లోపు లాకౌట్ ఎత్తివేయాలని ఆదేశాలు రానున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో గణపతి షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి యాజమాన్యంతో మాట్లాడి కార్మికుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తాం
నర్సాపూర్, వెలుగు : గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అల్లూరి సీతారామరాజు గురుకులంలో ఎమ్మెల్యే మొక్కను నాటి మాట్లాడారు. ప్రభుత్వం గురుకులాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తోందని తెలిపారు. అనంతరం 17, 18న జరిగే సమైక్యత వజ్రోత్సవాల సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ గుప్తా, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమ్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, ప్రిన్సిపాల్ రామ్మోహన్ పాల్గొన్నారు.
ఆపదలోఆదుకుంటున్న సీఎంఆర్ఎఫ్
కోహెడ(బెజ్జంకి)వెలుగు: ఆపదలో ఉన్న వారిని సీఎంఆర్ఎఫ్ ఆదుకుంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శుక్రవారం బెజ్జంకిలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టార న్నారు. అనంతరం గుగ్గిళ్లలో అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించారు. గుండారంలో వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కవిత, పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్రాజయ్య, తదితరులు ఉన్నారు.
మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మెదక్ (పెద్దశంకరంపేట)/నారాయణ్ ఖేడ్, వెలుగు : మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్దశంకరంపేట తిరుమలాపూర్ చెరువులో శుక్రవారం ఎమ్మెల్యే చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య శాఖ ఆధ్వర్యంలో చెరువులో 75వేల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు మురళి పంతులు, వైస్ ఎంపీపీ రమేశ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, సర్పంచ్ సత్యనారాయణ, మత్స్యశాఖ
అధికారులు పాల్గొన్నారు.
