సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న సీఎం కేసీఆర్ రెండు ఎత్తిపోతల పథకాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎత్తిపోతల పథకాలతో జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 3.84 లక్షల వ్యవసాయ భూములకు సాగు నీరు అందనుంది. వీటి పనులకు దాదాపు 7 వేల ఎకరాల భూసేకరణ చేపట్టనున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కావాల్సిన సర్వే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. డీపీఆర్ ఆధారంగా జిల్లా నీటిపారుదల శాఖ అంచనాలు తయారు చేసి పరిపాలన అనుమతుల పొందగా, రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి టెక్నికల్ పర్మిషన్ రావడంతో టెండర్ల ప్రక్రియ ప్రాసెస్ లో ఉంది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఎనిమిది టీఎంసీల నీటిని ఎత్తిపోసి సాగునీరు అందించాలని ఆఫీసర్లు ప్లాన్ చేశారు. కాల్వలు, పంప్ హౌస్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కోసం భూ సేకరణ కొనసాగుతోంది.
4 సెగ్మెంట్ల వారీగా...
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా జిల్లావ్యాప్తంగా మొత్తం 3.84 లక్షల ఎకరాలకు నీరు అందించనున్నారు. సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో 57 వేల ఎకరాలు, జహీరాబాద్‌లో 1.06 లక్షల ఎకరాలు, అందోల్‌లో 56 వేల ఎకరాలు, నారాయణఖేడ్ సెగ్మెంట్‌పరిధిలో 1.65 లక్షల ఎకరాలకు రెండు లిఫ్టుల ద్వారా సాగు నీరు అందించనున్నారు. కాళేశ్వరం నీటిని సింగూరుకు తరలించి అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా 4 నియోజకవర్గాలకు నీరందించే పనులు జరగనున్నాయి. ఇందుకు రూ.4,427 కోట్లు ఖర్చు చేయనున్నట్టు అంచనా. నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం బోరంచ వద్ద బసవేశ్వర ఎత్తిపోతలు నిర్మిస్తుండగా, అందోల్ నియోజకవర్గ పరిధిలోని రాయికోడ్ మండలం ఐదులాపూర్ వద్ద సంగమేశ్వర ఎత్తిపోతలు కట్టనున్నారు. సంగమేశ్వర స్కీమ్ ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల్లోని 12 మండలాల్లోని 231 గ్రామాలకు సాగునీరందనుంది. బసవేశ్వర స్కీమ్‌ద్వారా నారాయణఖేడ్, అందోల్సెగ్మెంట్లలోని 8 మండలాల పరిధిలో ఉన్న 166 గ్రామాలకు నీరందిస్తారు.
రెండు పంప్ హౌస్‌ల ద్వారా
సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో కుడి, ఎడమ కాల్వలకు రెండు పంప్ హౌస్ లను నిర్మించనున్నారు. మొదటి పంపు ద్వారా ఐదులాపూర్ నుంచి వెంకటాపూర్ డెలివరీ సిస్టర్న్ వరకు దాదాపు125 మీటర్ల ఎత్తులో నీటిని ఎత్తి పోస్తారు. రెండో లిఫ్టును జహీరాబాద్ కెనాల్ పై హోతికుర్దు నుంచి గోవిందాపూర్ వరకు సుమారు 40 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్తారు. ఈ రెండో లిఫ్ట్ ద్వారా మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాలకు నీరు అందిస్తారు. డెలివరీ సిస్టర్న్ నుంచి జహీరాబాద్, హద్నూర్, కంది కెనాల్స్ ద్వారా మొత్తం 3.84 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. రిజర్వాయర్లు, కాలువలు నిర్మించడమే కాకుండా అవసరమైతే పెద్ద చెరువులకు కూడా కాళేశ్వరం నీటిని మళ్లించి పొలాలకు నీరందించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం
