
గ్రేటర్ హైదరాబాద్ లో టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం ఓ కార్మికుడి ప్రాణాలకే ప్రమాదంగా మారింది. వైర్లకు ఆనుకొని నిర్మిస్తున్న భవనంలో పని చేస్తున్న కార్మికుడు కరెంటు తీగలు తగిలి కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ( ఆగస్టు 29 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి .. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో సూరారం కాలనీకి వెళ్లే దారిలో కరెంటు వైర్లకు ఆనుకొని భవనం నిర్మాణం జరుగుతోంది.
కరెంటు వైర్లకు ఆనుకొని భవనం నిర్మిస్తున్నప్పటికీ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో భవనంలో పని చేస్తున్న కార్మికుడు కరెంటు తీగలు తగిలి కుప్పకూలడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతనిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను తక్షణమే కూల్చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. అధికారులు, యజమాని నిర్లక్ష్యం కారణంగా కార్మికుడు బలయ్యాడని.. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు స్థానికులు.